ప్ర‌స్తుతం ఉండే యాంత్రిక జీవితంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల పై శ్ర‌ద్ధ తీసుకునే స‌మ‌యం వారికి ఉండ‌డం లేదు. కేవ‌లం వారికి క‌డుపు నిండిందా లేదా అని మాత్ర‌మే చూస్తున్నారు కాని పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాన్ని అందిస్తున్నామా లేదా అన్న‌ది ఎవ్వ‌రూ పెద్ద‌గా గ‌మ‌నించ‌డం లేదు.  అది ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నది. అయితే కింద సూచించిన విధంగా తల్లిదండ్రులు పిల్లలకు రోజూ ఆహారం పెడుతుంటే దాంతో వారికి సరైన పోషణ అందుతుంది. తద్వారా వారు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మరి తల్లిదండ్రులు పిల్లలకు రోజూ తినిపించాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

 

1. పిల్లలకు ఉదయం 8 గంటల లోపే కచ్చితంగా అల్పాహారం ఇవ్వాలి. దాంతో వారికి త్వరగా శక్తి అందుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఆలస్యం చేసే కొద్ది శరీరంలో నీరసం పెరుగుతుంది. శక్తి లేకుండా ఉంటారు. లేట్‌గా తిన్నా పెద్దగా ఫలితం ఉండదు. కనుక ఉదయాన్నే వారికి త్వరగా ఆహారాన్ని ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 

2. ఉదయాన్నే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్ ఫుడ్ తినిపిస్తుంటారు. అలా చేయరాదు. వాటి కన్నా ఇడ్లీ, చపాతి, పోహా, కిచ్‌డీ వంటి సాంప్రదాయ వంటకాలను తినిపించాలి. వాటి ద్వారానే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇడ్లీ, దోశ తినిపించేట్లయితే వాటిని కొబ్బరి చట్నీతో పెట్టాలి. కొబ్బరిలో ఉండే పోషకాలు పిల్లలకు లభిస్తాయి. వారు ఆరోగ్యంగా ఉంటారు.

 

3. సీజన్‌లో లభించే పండ్లను పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో వారికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి.

 

4. సాధ్యమైనంత వరకు పిల్లలకు బయటి ఆహారం పెట్టరాదు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. అంతగా అవసరం అయితే చీజ్ తినిపించవచ్చు. అది పౌష్టికాహారమే. ఇక ఇంట్లో తక్కువ నూనెతో చేసిన నాణ్యమైన పదార్థాలతో వండిన పిండి వంటలు లేదా చిరు తిండి పెడితే మంచిది. అది కూడా తక్కువగానే ఇవ్వాలి.

 

5. పిల్లలకు వారంలో కనీసం 4 రోజులపాటు అయినా ఆకు కూరలతో చేసిన ఆహారం ఇస్తే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

 

6. స్కూల్స్‌కు వెళ్లేటప్పుడు కూడా లంచ్ బాక్సులో పండ్లు, క్యారెట్లు, బీట్‌రూట్, కీర దోస వంటి పచ్చి కూరగాయలు ఉండేలా చూడాలి. వారు తినలేకపోతే అలవాటు చేయాలి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పీచు పదార్థం లభిస్తుంది. అది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు.

 

7. పిల్లలకు రోజూ ప్రోటీన్లు లభించేందుకు గుడ్డు, పాలు, పప్పు ఇవ్వాలి. అలాగే వారంలో రెండు, మూడు సార్లు చేప‌లు, చికెన్‌, మ‌ట‌న్ వంటి ఆహారాల‌ను పెట్ట‌వ‌చ్చు. వాటితో శరీర నిర్మాణం సక్రమంగా ఉంటుంది. పిల్లలు చక్కగా ఎదుగుతారు. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: