స్త్రీని గౌరవించిన ప్రాచీన తెలుగు కవులలో వీరబ్రహ్మం గారు అగ్రేసరులు. స్త్రీలలో తల్లికి ఆయన పెద్ద పీట వేశారు. ఇటీవల స్త్రీవాదం మొదలైన తర్వాత అమ్మ పైన ఆరాధనతో కూడిన కవితలు చాలా వచ్చాయి. ప్రపంచీకరణ వల్ల తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్న నేపథ్యం లోనూ అమ్మ మీద మంచి కవితలు వచ్చాయి. అంతకు ముందు కూడా ఆధునిక కవిత్వం లోనూ సినిమా పాటల లోనూ తల్లికి గొప్ప స్థానం దక్కింది. గురజాడ, శ్రీపాద వంటి వాళ్ళ సాహిత్యంలో తిరుగుబాటు తల్లులు కనిపిస్తారు. ప్రాచీన సాహిత్యం లోనూ తల్లికి మంచి స్థానమే ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మం గారు అమ్మను గురించి చెప్పిన పద్యాలు విశిష్టంగా కనిపిస్తాయి. అమ్మ ప్రేమలో కాలుష్యం ఉండదు. అన్ని రకాల కష్టసుఖాలనూ సహించుకుంటుంది. తల్లి అనే పదం వింటేనే మనసు పులకరించి పోతుంది అని ఆయన అనుభూతి. కవి నోటి నుంచి మాట ఊరికే రాదు. ఉన్న పరిస్థితుల నుంచే కవులు ఏదైనా చెబుతారు. 

 

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.

 

బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.... ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు... అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకవచం.

మరింత సమాచారం తెలుసుకోండి: