అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు... అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు.... అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. \జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ.....శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే... జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ. అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. మనకు జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.

 

అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.... ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు... అందుకే అమ్మ అమాయకురాలు.

 

పరీక్షల్లో తప్పామని నాన్న చెడామడా తిట్టేస్తుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకవచం. మనకు ఏమాత్రం సుస్తీ చేసిదంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ ఆ మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత, సాహిత్య పరంగా, మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకు మించింది ఏముంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ అమ్మ‌ను వ‌దులుకోకూడ‌దు, సొంత ఊరును వ‌దులుకోకూడ‌దు. అమ్మ ఊరు ఉంటే చాలు అవే మ‌న‌కు పెద్ద ఆస్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి: