అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం ఎంతటి దౌర్భాగ్యం.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ వున్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది. రెండేళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాలా 70 లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షలన్నమాట. కాని బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెలకట్టడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు.

 

ఇటీవల కాలంలో చాలామంది త‌ల్లిదండ్రులు తీవ్రమైన డిప్రషన్‌కు లోనవుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణా బాధ్యతను బంధువులు లేదా పనివాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లలో పెరుగుతున్న డిప్రషన్‌కు ఇది ప్రధాన కారణమని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు దగ్గర లేక పనివాళ్ల దయాదాక్షిణ్యాల మీద త‌ల్లిదండ్రులు బ్ర‌త‌కాల్సి వ‌స్తుంది.  ఫలితంగా తీవ్రమైన ఒంటరితనాన్ని వీళ్లు ఫీలవుతున్నారు.

 

కొందరు వృద్ధులైతే ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. చండీఘడ్‌లో ఈ పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయని మానిసిక నిపుణులు పేర్కొన్నారు. ‘తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లల నుంచి ప్రేమ, వాత్సల్యాలు, అండదండలు కోరుకుంటార’ని నిపుణులు చెప్తున్నారు. చండీఘడ్‌లో ఇలాంటి సీనియర్‌ సిటిజన్‌ బాధితుల సంఖ్య రెట్టింపు అయిందని గణాంకాలు చెప్తున్నాయి. చండిఘడ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు చెందిన సైకియాట్రిస్టు నిపుణులు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో చండీఘడ్‌లో ఒంటరితనంతో బాధపడుతున్న సీనియర్‌ సిటిజన్ల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: