శృష్టికి మూలం అమ్మ. తెలుగు అక్ష‌రాల్లో ఆది అక్ష‌రం అమ్మే. అంత విలువైన అమ్మ‌ని తెలుసుకోవా లంటే ప్ర‌కృతిని తెలుసుకున్న‌ట్లే. ఎందుకంటే ప్ర‌కృతిని స్త్రీతో పోలుస్తారు కాబ‌ట్టి. మ‌నిషి జీవ‌నానికి ఈ ప్ర‌కృతి ఎంత ముఖ్య‌మో బిడ్డ ప్ర‌కృతిని చూడ‌టానికి అమ్మే మార్గ‌ద‌ర్శ‌కం. భాషకు అందని భావం అమ్మ‌. ఎన్ని జన్మలైనా తీర్చుకోలేని రుణం అమ్మ‌ది. కనిపించే దైవం అమ్మ.. ఆది గురువు అమ్మే. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం ఆధునికతతో తన రూపం మార్చుకున్న, అమ్మతో బంధం చెక్కుచెదరదు. అదే అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం..  కని పెంచి ఏమీ తెలీని వయసులో అన్ని సపర్యలూ చేసి పెద్ద చేస్తుంది. పిల్లలు పెద్ద వాళ్ళయి, తమ కాళ్ళపై నిలబడితే తల్లిదండ్రుల కంటే సంతోషించే వాళ్లు మరొకరుండరు. అయితే విధి వక్రించి, చేదోడు వాదోడుగా ఉండాల్సిన పిల్లలకే జీవింతాంతం సపర్యలు చేయాల్సి వస్తే, ఆలోచనే భయానకంగా ఉంది కదా. ఇక ఆ కష్టం అనుభవించే తల్లి మనోవేదన వర్ణనాతీతం. చెట్టంత కొడుకుని చంటి పిల్లాడిలా సేవలు చేస్తూ, అమ్మ అనే పదానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తోంది ఆ మాతృమూర్తి.  ఇతడి పేరు వెంకటేష్. వయస్సు 25 సంవత్సరాలు. 2004 వరకూ ఇతడు అందరిలానే ఎంతో చలాకీగా ఆరోగ్యం ఉండేవాడు. ఇళ్లలో టైల్స్ వేసే పనిచేస్తూ తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ విధి ఇతడి పాలిట శాపంగా మారి కోలుకోలేని దెబ్బతీసింది.

 

 2004 డిసెంబర్ 26న ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదంలో రెండు చేతులు, ఓ కాలు దెబ్బతినడంతో వైద్యులు వాటిని తొలిగించారు. ఆ రోజు నుండి వెంకటేష్ జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి. ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండి తమ చేతికి అందివచ్చాడనుకున్న కుమారుడు ఎటూ కదలలేని పరిస్థితిలో తన పనులు కూడా తాను చేసుకోలేని దుస్థితికి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరి రోజుల్లో తమకు సేవచేస్తాడనుకున్న కొడుకు.. మంచానికే పరిమితమవ్వడం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టని రోజంటూలేదు. ఇదిలా ఉంటే వెంకటేష్ తండ్రి కొమురయ్య కాయాకష్టం చేసి కుటుంబ భారాన్ని మోస్తుంటే, తల్లి శశిరేఖ మాత్రం తన బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ రోజంతా తన బిడ్డకు సేవ చేయడంలోనే గడుపుతుంది. 25 ఏళ్ల కుమారుడికి ఏడాది పిల్లాడిలా కాలా కృత్యాల నుండి మొదలుకుని అన్ని పనులు తానే దగ్గరుండి చేస్తుంది. తన కుమారుడికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. 

 

 తన బిడ్డకు సేవ చేయడం తనకు ఏ మాత్రం భారం కాదని, ఏ తల్లికీ బిడ్డ ఎప్పటికీ భారం కాబోడని తన తుదిశ్వాస వరకు కుమారుడికి సేవ చేస్తానని చెప్తోంది ఆ మాతృమూర్తి. ఇక తనకు కనిపించే దైవం తన తల్లేనని వెంకటేష్ చెప్తున్నాడు. తనను ఇప్పటికీ చంటి పిల్లాడిలా కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని సపర్యలు తన మాతృమూర్తే చేస్తుందని అన్నాడు. ప్రమాదంలో రెండు చేతులు, ఓ కాలు పోగొట్టుకుని బ్రతుకు మీదే విరక్తి చెందుతున్న సమయంలో తన తల్లే తనలో ధైర్యాన్ని నింపిందని, తన తల్లే తనలోకమని, తన తల్లి తన పై కురిపిస్తున్న ప్రేమానురాగాలే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయంటున్నాడు వెంకటేష్‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: