అమ్మ... భాషకు అందని భావం. ఎన్ని జన్మలైనా తీర్చుకోలేని రుణం. కనిపించే దైవం అమ్మ.. ఆది గురువు అమ్మే. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచం ఆధునికతతో తన రూపం మార్చుకున్న, అమ్మ ప్రేమ అజరామరం. ప్ర‌పంచంలో ఏ త‌ల్లైనా కూడా త‌న ఆక‌లి కంటే కూడా బిడ్డ ఆక‌లికి ప్రాధాన్య‌మిస్తంది. నిస్స‌హాయ స్థితిలో కూడా త‌న పిల్ల‌ల ఆక‌లి తీర్చిన ఓ త‌ల్లి క‌థ త‌మిళ‌నాట చోటు చేసుకుంది. ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 

 

వివ‌రాల్లోకి వెళితే...ఇంతకీ ఆ నిరుపేద తల్లి ఏం చేసిందంటే... తమిళనాడులో సేలంకు చెందిన సెల్వం, ప్రేమ ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇటుక బట్టీలో పనిచేస్తూ సేల్వం,  ప్రేమ తమ కుటుంబాన్ని పోషించేవారు. కాగా సొంతంగా వ్యాపారం చేద్దామనుకున్న సెల్వం దొరికిన చోటల్లా అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ అందులో నష్టాలు రావడంతో మొత్తం అప్పు రూ.2.5 లక్షలుగా మిగిలింది. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అసలే భర్త చనిపోయిన ప్రేమను అప్పులవాళ్లు వేధించసాగారు.

 

దీంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. అటు ముగ్గురు పిల్లలు ఆకలితో అల్లాడుతుండటంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఇంటి ముందు వెళ్తున్న వెంట్రుకల వ్యాపారికి ఆమె వెంట్రుకలు అమ్మి రూ.150 తీసుకుంది.రూ.100తో పిల్లల ఆకలి తీర్చింది. కాగా రూ.50తో విషం కొనుక్కుందామనుకుంది. కానీ దుకాణుదారులు ఎవరూ ఆమెకు విషం అమ్మకపోవడంతో గన్నేరు గింజలను మింగే ప్రయత్నం చేసింది.


 ఇదంతా గమనించిన ఆమె సోదరి ప్రేమను అడ్డుకుంది.ఈ  విషయం గురించి జి. బాల అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆమె దీనగాధ గురించి తెలుసుకున్న నెటిజన్లు విరాళంగా ఏకంగా రూ.1.45 లక్షలు సమకూర్చి ఆమెకు అందించారు. అంతేగాక ప్రేమకు వితంతు పెన్షన్ అందేలా ప్రభుత్వంతో మంజూరు చేయించారు. అటు ప్రేమకు జీవనోపాధి కల్పిస్తానని బాల స్నేహితుడు చెప్పడంతో ఇప్పుడు ఆ తల్లి తన పిల్లలను చక్కగా పోషించుకుంటోంది. దీన్ని బ‌ట్టి ఒక్కోసారి సోష‌ల్ మీడియాతో న‌ష్ట‌మేకాక మంచి ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: