సంక్రాంతి పండుగ వచ్చేసింది. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. ఇక రేపే భోగి. మరి.. భోగి స్పెషల్ వంటకం ఏంటో మీకు తెలుసు కదా. స్వీట్ పొంగల్. అవును.. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ స్వీట్ పొంగల్‌ను తింటారు. మరి.. సంక్రాంతి రుచుల్లోని భోగి స్పెషల్ వంటకమైన స్వీట్ పొంగల్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

కావాల్సిన ప‌దార్థాలు: సన్నని బియ్యం- ఒక క‌ప్పు, పెసరపప్పు- ఒక క‌ప్పు, పాలు- ఒక క‌ప్పు, బెల్లం పొడి- రెండు క‌ప్పులు, నెయ్యి- అర క‌ప్పు, జీడిపప్పు- కొద్దిగా, బాదం- కొద్దిగా కిస్మిస్- కొద్దిగా, యాలకుల పొడి- అర టీ స్పూన్‌, ల‌వంగాలు- మూడు.

 

త‌యారీ విధానం: ముందుగా పెసరపప్పును పాన్‌లో వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని తీసుకొని.. నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్ లో కడిగిన బియ్యం, వేయించి పెట్టుకున్న పెసరపప్పు, కొన్ని పాలు, బియ్యానికి సరిపడా నీళ్లు పోసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఓ నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఇంతలో ఓ పాన్ తీసుకొని నీళ్లు పోసి బెల్లం వేసి పాకం పట్టండి. కుక్క‌ర్‌లో అన్నం ఉడికిన తర్వాత బెల్లం పాకాన్ని దాంట్లో వేసి ఇంకొంచెం నెయ్యి వేసి కొంచెం సేపు ఉడికించండి. ఇంతలో మరో పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ను వేయించండి. వాటిని ఉడికిన అన్నంలో వేసి లవంగాలు, యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని కలిపి స్టౌ కట్టేయండి. అంతే.. వేడి వేడి స్వీట్ పొంగల్ రెడీ. కాసింత నెయ్యి వేసుకొని వేడి వేడిగా లాగించేస్తే ఉంటది… అమృతం తిన్నట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: