దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన, కఠినమైన శిక్షలు విధించినా మహిళలపై జరుగుతున్న అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. నిర్భయలాంటి చట్టాలొచ్చినా అకృత్యాలు ఆగడం లేదు. మహిళలు రక్షణ కరువైంది అనడానికి ఇటీవల జరగుతున్న ఘటనలే సాక్ష్యాలు. దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాల బారిన పడిన చిన్నారుల రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట కామందుల దాహానికి అబలలే కాక చిన్నారులు సైతం బలవుతున్నారు. 

 

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కఠినమైన దిశా చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ఇలాంటి ఆగ‌డాలు ఆగ‌డం లేదు. తాజాగా  న్యాయం కోసం వచ్చిన బాధితురాలిపై రక్షణ కల్పించి.. న్యాయం చేయాల్సిన ఎస్ఐ అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. ఓ యువకుడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి.. అతనితో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకుతిరగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి అరండల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

 

ఐతే ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదుచేయకుండా ఆ యువతిని ట్రాప్ చేశాడు. విచారణ పేరుతో ఇంటికి పిలిపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మ‌రోవైపు కానిస్టేబుల్ రాము యువతి తల్లిని లాడ్జికి రమ్మని పిలిచినట్టు తెలుస్తోంది. అరండల్‌పేట పోలీసులపై అర్బన్ ఎస్పీకి యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులతో పాటు తనను మోసం చేసిన డేవిడ్‌ను అరెస్ట్‌ చేయాలని యువతి డిమాండ్ చేస్తోంది.  బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: