ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయేషా మీరా హత్య కేసు  ఎంతటి సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఆయేషా మీరా హ‌త్య కేసులో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆమె తల ఎముకలో గాయమున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తాజా నివేదికలో బయటపడింది. 

 

ఇటీవ‌ల ఆయేషా హత్య జరిగి దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడంతో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆయేషా మీరా భౌతిక కాయానికి రీపోస్టుమార్టం చేసింది.  అయితే తాజాగా సీఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను సీబీఐకు అందజేసింది. ఇక ఈ నివేదికలో చనిపోయింది అమ్మాయి అని, అప్పుడు ఆమె వయస్సు 19సంవత్సరాలని తేల్చారు. తల భాగంలోని ఉన్న ఎముక ఫ్యాక్చర్ అయినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎముకలో ఉన్న షార్ప్ ఏడ్జ్‌లో బలంగా గాయం అయినట్టు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. కాగా, 2007 డిసెంబర్‌ 27న బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్‌లో హత్యకు గురయింది. 

 

వసతి గృహంలోని బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన అక్కడివారు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.  అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: