నువ్వు ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటే..ప్రకృతి అంతా నీకు సహకరిస్తుంది. నిన్ను లక్ష్యంవైపు నడిపించేందుకు భగవంతుడు కూడా సాయపడతాడు.. పరసువేది రచయిత పాల్ కోహిలో చెప్పిన సూత్రమిది. ఇది అక్షరాలా నిజం చేసిందో యువతి. మురికి వాడ నుంచి వచ్చినా.. ఫుట్ పాత్ పై కూర్చుని చదివినా ఆమె చివరకు తన లక్ష్యాన్ని సాధించింది.

 

 

ఓ నిరుపేద చదువు అనే అస్త్రంతో ఏకంగా న్యాయమూర్తిగా మారింది. అమ్మాయి పేరు రూబీ.. హర్యానా పానిపట్‌లోని ఓ మురికివాడ రూబీ స్వస్థలం. నిరుపేద కుుటుంబం. ఎన్నోసార్లు పస్తులుండాల్సిన పరిస్థితి. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించిన రూబీ మాత్రం ఉన్నత శిఖరాలవైపే చూసింది. పేదరికం వెంటాడుతున్నా ఆమె దాన్ని ఎదిరించి పోరాడింది.

 

 

తమ ఆర్థిక పరిస్థితుల అంతంత మాత్రమే అయినా ఆమె తల్లిదండ్రులు చదివించారు. ఎం.ఏ ఇంగ్లిష్‌ చదువుతూ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ప్రిపేరైంది. 2016లో ఢిల్లీ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ సీటు సంపాదించింది. ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక హర్యాణా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసినా నెగ్గలేదు.

 

 

కుంగిపోకుండా మరింత పట్టుదలతో ఇటీవల ఝార్ఖండ్‌ జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసింది. మురికివాడలోని ఆమె ఇంటిని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేస్తే ఫుట్‌పాత్‌పైనే కూర్చొని చదువుకుంది. ఆ కష్టానికి ఫలితం దక్కింది. ఝార్ఖండ్‌ జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 52వ ర్యాంకు సాధించింది. న్యాయమూర్తిగా ఎంపికైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: