మలాలా యూసఫ్ జై...  అంతర్జాతీయ పరిస్థితుల మీద కాస్త అవగాహన ఉన్నా సరే ఈమె పేరు పరిచయం ఉంటుంది. ఉగ్రవాదుల మధ్య నుంచి లేచిన విద్యా కుసుమం. బాలికల విద్యకు ఆమె చేసిన పోరాటం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అసలు ప్రపంచం అంటే ఏ విధంగా ఉంటుందో తెలియని వయసులో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది మలాలా. పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో ఆడపిల్లలకు చదువు అనేది నిషేధం. లోయలో బాలికల పాఠశాలలన్నీ మూసివేయాలని 2009లో తాలిబాన్లు హుకుం జారీచేశారు. వందకు పైగా బాలికల పాఠశాల భవనాలను పేల్చివేశారు. 

 

ఉగ్రవాదుల మాటను లెక్క చేయని పౌరులు 2009 మార్చి తరువాత పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందరో బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఉపాధ్యాయులను కూడా కాల్చి చంపారు. విద్యార్ధుల ముందే ఉపాధ్యాయులను కాల్చి చంపడం తో ఒక్కసారిగా ప్రపంచం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ జనవరి లో స్వాబి అనేచోట ఐదుగురు ఉపాధ్యాయినులను తాలిబన్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. అయితే బాలికల విద్య కోసం మలాలా పెద్ద పోరాటమే చేసింది. అయితే ఆమెను 2012 అక్టోబర్‌ లో వాయువ్య స్వాత్‌ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి) ముష్కరులు తలపై కాల్చిన సంగతి తెలిసిందే.

 

ఆ తర్వాత ఆమె కోసం ప్రపంచం మొత్తం కదిలి వచ్చింది. ఆ తర్వాత ఆమె నోబెల్ శాంతి బహుమతి పొందింది. అంతర్జాతీయంగా అన్ని దేశాల అధ్యక్షులు ఆమె గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇక అమెరికా అధ్యక్షుడుగా ఉన్న ఒబామా ఆమెను ఆహ్వానించారు. అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయ మీడియాలో హైలెట్ అయింది. జీవితంలో మలాలా చిన్న వయసులోనే చాలా చూసింది. రాజకీయాల మీద ఉన్న ఆసక్తి చదువు మీద ఉన్న ఆసక్తితో ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందరో బాలికలకు ఆదర్శంగా నిలిచింది మలాలా.

మరింత సమాచారం తెలుసుకోండి: