స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు.. స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. తన రక్తమాంసాలతోనే ఈ జగత్తు నడుస్తోంది. ఇక ముందూ నడుస్తుంది. ఆత్మీయతలో అమ్మగా, సహనంలో భూదేవిగా, అణకువలో అనసూయగా, కరుణలో మ‌ద‌ర్ థెరిస్సాగా, వీర‌త్వంలో ఝాన్సీరాణిగా, అవసరమైతే ఆది శక్తిగా.. ఇలా త‌న విశ్వ‌రూపాల‌ను చూపించే మ‌హిళ గురించి ఎన్ని చెప్పుకున్నా త‌క్కువే. `యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః` అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం. వాస్త‌వానికి వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. 

 

అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు. కానీ, మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైనారు. అయితే కొనేళ్ల‌కు మ‌హిళ‌లు ఆ సంకెళ్ళను వ‌దిలించుకుని వంటిళ్లు వదలి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇదీ అదీ అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడం, చాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దం లోను, ముఖ్యంగా ఈ శతాబ్దంలోను గమనించవచ్చు. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఒక మహిళ, 1960 లో సిరిమావో బండార నాయకే, శ్రీలంక ప్రధాన మంత్రిగా అధికారంలో రావడంతో అంతర్జాతీయంగా ఒక సంచలనం సృష్టించింది. ఎలా ఒక మహిళ ఆ ఉన్నత పదవిలోకి రాగలిగింది.. ఎలా పాలన చేయబోతుంది.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్ర‌శ్న‌లు.. అనేక అనుమానాలు అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

 

కానీ, విచిత్రం ఏంటంటే.. సిరిమావో బండార నాయకే 1960–65, 1970–77 మరియు 1994–2000 లలో శ్రీలంక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే ఏకంగా మూడు సార్లు ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన మొదటి మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఆ త‌ర్వాత ఈమెను ఆద‌ర్శంగా తీసుకుని ఎంద‌రో మ‌హిళ‌లు ప్రధానులుగానో, అధ్యక్షులుగానో, ఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇప్ప‌టికీ అది కొనసాగుతూనే ఉంది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: