నిర్భయ హత్యాచారం కేసులో ఉరి తీయ‌బ‌డిన న‌లుగురు దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాలు చివ‌రి కోరిక‌పై ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేద‌ని  తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఉరి తీయటానికి ముందు మీ చివరికోరికేంటని అడిగితే వారి నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న రాలేద‌ని చెప్పారు. దీంతో నిబంధనల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీసినట్టు  పేర్కొన్నారు. సాధార‌ణంగా త‌మ కుటుంబం కోసంగాని, త‌మ ఉద్దేశాల‌ను ప్ర‌తిబింబేంచే కోరిక‌ల‌ను దోషులు బ‌య‌ట‌పెడుతుంటార‌ని, అయితే ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాల వైఖ‌రిని త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని జైలు డైరెక్ట‌ర్ తెలిపారు.

 

 దేశంలో ఇప్పటి వరకు ఒకేసారి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా నిర్భయ దోషుల ఉరితీతపై బాధితురాలి తల్లి ఆశాదేవి స్పందిస్తూ  ‘ చివరకు న్యాయమే గెలిపించింది అంటూ వ్యాఖ్య‌నించారు. ఇన్నాళ్లకు నా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందంటూ భావోద్వేగానికి గురైంది. త‌న కూతురుకు చేసిన అన్యానికి వారికి త‌గిన శిక్ష ప‌డింద‌ని పేర్కొంది. ఏడేళ్లపాటు న్యాయ పోరాటం చేశాం. ఈ పోరాటంలో త‌న‌కు తోడ్పాటుగా నిలిచిన మంచి మ‌న‌స్సున్న వారంద‌రికీ కృతజ్ఞ‌త‌లు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్ర‌జ‌లంతా బాధిత కుటుంబాల‌కు తోడుగా నిలబడాలి’ అంటూ ఆశాదేవి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

 అయితే మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని అన్నారు. త‌న బిడ్డ‌లాంటి వారికి అండ‌గా నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. నిర్భయ కేసులో ఉరి ఖ‌రారైన దోషుల కుటుంబ స‌భ్య‌లు త‌రుచూ పిటిష‌న్లు వేస్తూ వాయిదా వేస్తూ వ‌చ్చారు. గురువారం కూడా ప‌టియాల కోర్టు వీట‌న్నింటిని కొట్టివేయ‌డంతో ఉరితీత‌కు అడ్డంకుల‌న్నీ తొల‌గి..చివ‌రికి న‌లుగురికి మ‌ర‌ణ‌దండ‌నం అమ‌లైంది. నిర్భ‌య సంఘ‌ట‌న నాటి నుంచి ఉరితీత వ‌ర‌కు ఎన్నెన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నిర్భ‌య సంఘ‌ట‌న కొత్త‌చ‌ట్టాల‌కే కాదు..మ‌హిళా భ‌ద్ర‌త‌కు కొత్త దారి చూపింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: