అమ్మ అంటే సృష్టికి మూలం. అమ్మలేని జన్మ మనకి లేదు. అమ్మ ఉన్నపుడు అమ్మ విలువ తెలియదు. అమ్మ గూర్చి అర్థంచేసుకునే  సమయానికి అమ్మ  ఉండదు. దేవత లాంటి అమ్మను అందరికీ ఇచ్చిన భగవంతుడు కొందరు పిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యే వయసులో అకారణంగా అమ్మను తన వద్దకు తీసుకొని వెళ్లిపోతుంటాడు, గతి తప్పిన గమ్యాలై గూడు చెదిరిన పక్షులవలె అందరు వున్నా అనాధలుగా మిగిలిపోతుంటారు. అమ్మను దూరం చేసి గమ్యమెరుగని ప్రయాణం చేయమంటే చిన్ని గుండెలు ఎలా తట్టుకొనగలవు.

 

 

ఇది వారి నుదుట రాసిన కర్మ ఫలమా లేక విధి ఆడే వింత ఆటనో తెలియదు.   ఇలా ఎందరో అభాగ్యుల జీవితాలు అమ్మ ప్రేమ మరియు అమ్మ తోడు లేక దారం తెగిన పతంగివలె చెట్టుకో పుట్టకో చిక్కి చెదిరిపోతున్నాయి !  అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు.. అమ్మలేని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు.. అమ్మ హృదయం సూర్యచంద్రులు దాగిన నీలాకాశం, అమ్మ చిరుకోపం మెరిసే మేఘం, కురిసే వర్షం, అమ్మ లేని జీవితం నిశిరాత్రి చీకటి శ్మశానం అని నా భావన. ఇంకా వివరించటానికి మాటలు లేవు రాయడానికి అక్షరాలు చాలవు..!! అమ్మ లేని వాళ్ళ భాద చెప్పడానికి మాటలు లేవు. 

 

 

ఇకపోతే  అమ్మ ఉన్నవారు కూడా పట్టించుకోడం లేదు. అమ్మ కొందరి మనుషుల వ్యధ, కొడుకులు తల్లిని ప్రేమించడం గౌరవించడం పూజించడం సేవలు చేయడం అనేది తరువాత విషయం అనుకుందాం కాని ఎందుకు అంత హీనంగా చూస్తున్నారు. దగ్గినా తుమ్మినా నీరసంగా వున్నా ఎందుకు అంత వింతగా చూస్తున్నారు? వేళకు పట్టెడు అన్నం పెడుతున్నారా? నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని నీచమైన పదాలతో దుర్భాషలాడుతున్నారు, మానసికంగా హింసలు పెడుతూ వెట్టిచాకిరీ చేయిస్తూ ఆవేశంతో చేయి చేసుకుంటున్నారు.

 

 

చివరికి తల్లిని మెడపట్టి గడప బయటకు తోసేస్తున్నారు? సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా దిగజారిపోతున్నారు ఏమి ఈ దౌర్భాగ్యం.వృద్ధులైన తల్లులకు సేవ చేయలేని దుర్మార్గులు అడవులలో వదలడం, అంతస్తుల మీద నుంచి తోసేయడం ఇలా కనపడకుండా హత్యలు చేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో వదిలి దిక్కులేనివారిగా చేస్తున్నారు.కొడుకు, కూతురు ఎప్పుడు వస్తారా అని ఎదురు చుస్తే ఉంటుంది.

 

 

అయినప్పటికీ  అమ్మ ఎన్ని బాధలు, అవమానాలు పడినా తన చివరి శ్వాస వరకు కన్న బిడ్డలపై ఎనలేని మమకారం చూపుతూనే వుంటుందనేది పరమ సత్యం.. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మన చిన్నపుడు కూడా మనం దగ్గినా, తుమ్మినా, జ్వరం వచ్చిన, బాత్రూమ్ కి వెళ్లిన అన్ని భరించి మనల్ని అసహ్యించుకోకుండా పెద్ద చేసింది.. అప్పుడు అమ్మే మనల్ని వద్దు అనుకుంటే మనం పెరిగి పెద్ద అయ్యేవాళ్ళం కాదు.. కానీ ఇప్పుడు మనల్ని పెంచిన అమ్మ ముసలిది అయిపోయిందని పట్టించుకోవడం మానేస్తే అది క్షమించరాని తప్పు మిత్రమా.. రేపు మనం ముసలివాళ్ళం అయ్యాక మన పిల్లలు కూడా మనల్ని అలా వదిలేయకూడదు కదా.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: