అమ్మ అన్న రెండు అక్షరాలలో ఎంతో ఆప్యాయత ఉంది. ఆ రెండు అక్షరాలు కూడా పలకడానికి నోచుకోని అభాగ్యులు ఈలోకంలో ఎంతో మంది ఉన్నారు.. వాళ్ళ జీవితాలు తెగిన గాలిపటంలా గమ్యం లేక తిరుగుతూ ఉంటాయి. మనకి మంచి,  చెడు, చెప్పే ఆ అమ్మే లేకపోతే బిడ్డ భవిష్యత్తు అంధకారం.

 

అయితే దానికి నా జీవితంలో జరిగిన సంఘటనలే  ఉదాహరణ. నా చిన్నపుడు మా అమ్మ నా దగ్గరే ఉంది . కానీ నాకు తెలిసి తెలియని వయసులో  అమ్మ చనిపోయింది . 4వ సంవత్సరంలో అమ్మమ్మా వాళ్ళు తీసుకునొచ్చి పెంచారు. నాన్న పట్టించుకోడం మానేసాడు. కొన్నాళ్ళు జీవితం తెలిసి తెలియని వయసులో బాగానే సాగిపోయింది. స్కూల్ కి వెళ్తున్న.. నన్ను దగ్గరకు తీసుకుని నాకు జడ వేసి, బొట్టు పెట్టి, టిఫన్ పెట్టి స్కూల్ కి పంపే అమ్మ లేదు. బైక్ ఎక్కించుకుని దించే నాన్న లేడు. ఒక్కదాన్నే వెళ్లేదాన్ని. మధ్యాహ్నం అందరి అమ్మలు వచ్చి వాళ్ళ పిల్లలకు గోరుముద్దలు పెడుతుంటే నేను మనసులో ఎంత కుంగిపోయేదాన్నో నాకే తెలుసు.

 

నా బాధ బయట పెట్టేదాన్ని కాదు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ముసలివాళ్ళు. వాళ్ళని భాద పెట్టడం సరయినది కాదని చెప్పేదాన్ని కాదు. మా అమ్మ కి నేను ఒక్కదాన్నే. తోబుట్టువులు ఎవరు లేరు.. ఎవరన్నా రోడ్డు మీద అమ్మ, నాన్న, వాళ్ళ పిల్లలు వెళ్తుంటే వాళ్ళని చూసి ఏడిచిన ఏడుపు ఇప్పటికి గుర్తు ఉంది. ప్రతిరోజు దేవుడిని అడిగే దాన్ని నేను ఏమి తప్పు చేశాను అని.. నాకు అమ్మ కావాలి అని గట్టిగా అరావాలనిపించేది.. అరిసిన రాదు. వస్తుందంటే నా ప్రాణం పోయేదాకా అరుస్తూనే ఉండేదాన్ని.. నాకు కొంత వయసు వచ్చాక మా మావయ్య కి పెళ్లి అయింది. వచ్చే అత్త నన్ను అమ్మలా చూసుకుంటుంది అనుకున్నాను. కానీ అది జరగలేదు. అత్త సరిగా చూసేది కాదు. తినటానికి తిండిలేక దాచి మరి పెట్టేవాళ్ళు అమ్మమ్మా తాతయ్యలు.

 

ఆ రోజులు ఎప్పటికి మర్చిపోలేను. తర్వాత హాస్టల్ లో జాయిన్ అయ్యాను. ఇంటికి వచ్చేదాన్ని కాదు. నా తోటి స్నేహితుల అమ్మ, నాన్నలు ఆదివారం రోజున వాళ్ళ పిల్లలకి తినుబండారాలు, బట్టలు అన్ని కొనుక్కుని వచ్చేవాళ్ళు. నన్ను చూడడానికి మాత్రం ఎవరు వచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే నాకు అమ్మ లేదు.. నా బిడ్డ ఎలా ఉంది అని ఆలోచించడానికి మా అమ్మ దేవుని దగ్గర ఉంది కదా అని సరిపెట్టుకునే  దాన్ని. నా స్నేహితులు నీకు ఎవ్వరు లేరా... ! అని అడిగితే అప్పుడు నా ప్రాణం పోయినంత బాధ వేసింది. తల్లి లేకపోతే ఎంత భాధనో భరించే వాళ్ళకే తెలుస్తుంది. దేవుడు మనకోసం పంపిన వరం అమ్మ. ఆ అమ్మని ఏ కారణం చేత వదిలిపెట్టవద్దు. అమ్మని గుర్తు చేసుకోండి ఎక్కడున్నా.

 

కనీసం ప్రేమతో ఒక మాట అన్నా మాట్లాడండి. మనుషుల విలువ ఉన్నపుడు తెలియదు. దూరం అయితేనే తెలుస్తుంది.ఇంకా నా సంగతి అంటారా.. "అమ్మని దూరం చేసిన ఆ దేవుడు మళ్ళీ నా బిడ్డగా " మా అమ్మని నా కడుపునా పుట్టించాడు"...! మా అమ్మ మళ్ళీ నా దగ్గరకు వచ్చిందండి. మీరు కూడా అమ్మ విలువ తెలుసుకోండి.. ఉన్నంతకాలం అమ్మని మీ బిడ్డలా చూసుకోండి..! మా అమ్మ గూర్చి, నా గూర్చి విన్నందుకు ధన్యవాదాలు.. అమ్మ నువ్వు ఎక్కడున్నా నీకు వందనాలు...

మరింత సమాచారం తెలుసుకోండి: