ఫిష్ (చేప‌) తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది తిన‌డం వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు ఏవీ కూడా మ‌న ద‌రి చేర‌వు. అంతేకాక చేప‌లు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కొవ్వు శాతం అనేది ఉండ‌దు. దాంతో చాలా ప్రొటీన్, విట‌మిన్స్ ఉంటాయి. ఈ రోజు సండే స్పెష‌ల్ క‌ర్రీలో మ‌నం ఫిష్ బిర్యాని గురించి తెలుసుకుందాం...

 

కావల్సిన ప‌దార్ధాలు: చేపముక్కలు (కొర‌మేను)– అర కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్‌ స్పూన్లు, కారం – 1 టేబుల్ స్పూన్‌; బిర్యానీ మసాలా/ గరం మసాలా – అర టీ స్పూన్‌; పసుపు – కొద్దిగ; నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత; టొమాటొ – 1, ఇతర పదార్థాలు, బిర్యానీ ఆకు – 1, బిర్యానీ పువ్వు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క,  లవంగాలు – 6; పచ్చ యాలకులు – 3; సాజీరా – అర టీ స్పూన్‌.

 

గ్రేవీ కోసం: నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఉల్లిపాయల స్లైసులు – 1కప్పు, అల్లం –వెల్లుల్లి పేస్ట్‌ – ఒకటిన్నర కప్పు, గరం మసాలా పొడి – టీ స్పూన్‌, ధనియాల పొడి – అర టీ స్పూన్‌, కారం – అర టీ స్పూన్‌, పెరుగు – కప్పు, పుదీనా తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు,  కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు – తగినంత, పాలు – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత,  బిర్యానీ రైస్‌: బాస్మతి బియ్యం – 1 1/2 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – 1 టీ స్పూన్‌.

 

తయారు చేయు విధానం: చేపలు కాకుండా మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్‌ చేసుకోవాలి. దీంట్లో చేప ముక్కలు వేసి బాగా క‌లిపి పెట్టుకోవాలి. విడిగా గోరువెచ్చని పాలలో కుంకమపువ్వు వేసి కలిపి పక్కనుంచాలి ∙బాస్మతి బియ్యం కడిగి అరగంట నీళ్లలో నానబెట్టాలి. తర్వాత జల్లెడలో పోసి వడకట్టాలి ∙ఒక గిన్నెలో 6 కప్పుల నీళ్లు పోసి టీ స్పూన్‌ నూనె, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి ∙వడకట్టిన బియ్యం మరుగుతున్న నీళ్లలో వేసి ఉడికించాలి. అందులో కాస్త పుదీనా, ల‌వంగ‌, దాల్చిన చెక్క కొంచం వేసుకోవాలి. అయితే, ఆఫ్‌ బాయిల్‌ కాగానే వడకట్టిన బియ్యం పక్కనుంచాలి. మరొక గిన్నెలో కొద్దిగా నూనె వేసి చేప ముక్కలను రెండు వైపులా దోర‌గా వేయించుకోవాలి. దాంట్లోనే మరికొద్దిగ నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. ∙దాంట్లోనే మిగతా అన్ని దినుసులు వేసి కొద్దిగా వేయించాలి∙ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాక టొమాటో ముక్కలు ఉడికించాలి. గరం మసాలా, ధనియాలపొడి, కారం వేసి వేగాక పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడేలా ఉడికించాలి.  ఒక మందపాటి పెద్ద గిన్నెలో అడుగున కొద్దిగా గ్రేవీని ఒక లేయర్‌గా వేయాలి. దాని మీద సగం ఉడికిన అన్నాన్ని మరొక లేయర్‌గా వేసి ఆ పైన పుదీనా, కొత్తిమీర చల్లాలి. ఆ పైన వేయించిన చేప ముక్కలు కొన్ని ఉంచాలి. వాటి మీదుగా మళ్లీ అన్నం.. దాని మీద కొత్తిమీర–పుదీన– ఉల్లిపాయలు, కుంకుమపువ్వు పాలు.. ఆ పైన మళ్లీ చేప ముక్కలు.. ఆ పైన అన్నం.. ఇలా అన్ని లేయర్లు పూర్తి చేయాలి. 

 

గిన్నె పైన మందపాటి మూత పెట్టి గోధుమపిండి ముద్దతో సీల్‌ చేయాలి. కొంచం కూడా బ‌య‌ట‌కు గాలి రాకుండా గ‌ట్టిగా మూత పెట్టి సీల్ చేయాలి. మంట పెంచి 2 నిమిషాలు ఆ తర్వాత మంట బాగా తగ్గించి 10 నుంచి 15 నిముషాలు ఉంచాలి ∙మంట ఆర్పేసి మరో పది నిమిషాలు ఉంచి మూత తీయాలి. వడ్డించడానికి ఫిష్‌ బిర్యానీ రెడీ. సన్నని స్లైసులుగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు లేదా రైతాతో వడ్డించాలి. ఫిష్ బోన్‌లెస్ అయితే బావుంటుంది. బోన్ అయినా కూడా ప‌ర్వాలేదు కాని జాగ్ర‌త్త‌గా చూసుకుని తినాలి. ఇక కొర‌మీను చేత అయితే ఒక్క‌టే ముల్లుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: