ఇంటి బాధ్యతలతో అమ్మకు క్షణం తీరిక ఉండదన్నది కాదనలేని వాస్తవం. పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణతో ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకూ ఆమెకు అలసటే.ఆధునికత, సాంకేతికత వేయి దిక్కులుగా విస్తరిస్తున్న నేటి కాలంలో అమ్మకు ఎన్నెన్నో  సవాళ్లు, సమస్యలు తప్పడం లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ‘అమ్మ’ బాధ్యతలు మొదలవుతాయి.

 

కుటుంబ నిర్వహణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండడంలో మరిన్ని బాధ్యతలు తప్పవు. నేటి రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో అమ్మకు అదనపు బాధ్యతలు, సరికొత్త సవాళ్లు పెరిగాయి . సాంకేతికత పెరిగినకొద్దీ కుటుంబ వ్యవస్థలోనూ సంక్లిష్టత ఏర్పడుతోంది. నేటి ‘డిజిటల్ యుగం’లో బయటి వాతావరణమే కాదు, ఇంట్లో వాతావరణం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా గృహిణులకు పలురకాల ఒత్తిళ్లు తప్పడం లేదు. సాంకేతికత, విద్యారంగంలో మార్పుల ఫలితంగా పిల్లల పెంపకంలో ఉద్యోగినులు ఇదివరకు లేని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ ఫోనులు  సామాజిక మాధ్యమాలు, టీవీ కార్యక్రమాలు కుటుంబ వ్యవస్థపైనా, పిల్లల పెంపకంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

 

 

పసిపిల్లలకు అన్నం తినిపించడం, వారిని కుదురుగా కూర్చోబెట్టడం, మారాం చేసే చిన్నారులకు పాటలతో, ఆటబొమ్మలతో అమ్మలు లాలించడం ఒకప్పటి సంగతి. కాని ఇప్పుడు  ఆధునిక కాలంలో పిల్లల చేతుల్లో ఫోన్లు, కాస్త పెద్దపిల్లలైతే ‘ట్యాబ్’లు పెట్టాల్సిందే. హైస్కూల్‌కో, కాలేజీకో వెళ్లే పిల్లలకు స్మార్ట్ఫోన్లు, వాట్సాప్- ఫేస్‌బుక్- యూట్యూబ్‌లు వగైరా సోషల్ మీడియానే ప్రపంచం. ఇలాంటి పరిస్థితిలో అమ్మ మాటే పిల్లలకు వినిపించదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పగలూ రాత్రీ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతుంటే ఇక అమ్మ ఒంటరిదైపోదా? ఈ అలవాట్లతో ఇంట్లో మాటలే కరవు.. ‘గాడ్జెట్ల’ పుణ్యమాని తల్లీపిల్లల మధ్య అడ్డుగోడలు లేస్తున్నాయి.. ఒకప్పుడు తల్లి కొంగుపట్టుకుని తిరుగుతూ ‘అది కావాలి, ఇది కావాలి’ అని అల్లరి చేసే పిల్లలకు ఇపుడు స్మార్ట్ఫోనే లోకం, టీవీయే సర్వస్వం. ఫోనో, ట్యాబో ఇస్తే తప్ప ‘అన్నం ముట్టని’ మంకుపట్టు పిల్లల సంఖ్య పెరుగుతోంది.

 

సాంకేతికత పెరిగాక అమ్మతో మాట్లాడడం తగ్గిస్తున్న పిల్లలు చివరకు- తమ పంతం నెగ్గించుకునేందుకు ఆమెతో ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు అనేకం.. పదే పదే ఫోన్ వాడద్దంటూ అమ్మ మందలిస్తే- పిల్లలు బెదిరింపులు ఎక్కువ అయిపోయాయి. ఈకాలంలొ పిల్లలకు అమ్మ అంటే వండి పెట్టి, పని చేసే ఒక యంత్రం అని భావిస్తున్నారు.యంత్రాన్ని ఒక మనిషిలా భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: