మనల్ని నవ మాసాలు కానీ పెంచిన దేవత అమ్మ. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచింది అమ్మ. కానీ మనకోసం ఎన్నో ఇబ్బందులు పడిన అమ్మని మర్చిపోయి ఎక్కడో వృద్దాశ్రమంలోనో, రోడ్డుమీదో వదిలివేస్తున్నాము. దిక్కు దివానా లేకుండా అనాధల వదిలేస్తున్నాము. అయితే అలా వదిలేసినా కానీ అమ్మ మన మీద కోపం పెంచుకోదు దానికి ఒక ఊరులో జరిగిన సంఘటనే ఉదాహరణ. 

 

ఒక ఊరిలో  ఒకప్పుడు ఓ చిత్రమైన పద్ధతి ఉండేదట. వయసుపైబడి ఏ పనులూ చేయలేని పరిస్థితిలో ఉండే తల్లిదండ్రులను కుమారులు తీసుకొనిపోయి ఎత్తయిన కొండప్రాంతాల్లో వదిలి వచ్చేవారట. ఆహారం కూడా సంపాదించుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి చనిపోయేవారట. ఇదే తీరున ఓ యువకుడు ముసలిదైన తన తల్లిని భుజాలపై మోసుకుని కొండలపై వదలేసి రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తన తల్లి ఏదో చేస్తున్నట్లు ఆ యువకుడు గమనించాడు. చెట్ల కొమ్మలను, పువ్వులను తెంపుతూ కింద పడేస్తున్న తల్లిని ఏమీ అనకుండా అలాగే యువకుడు గమ్యం వైపు వెళుతున్నాడు.

 

చాలా దూరం వెళ్లాక, భుజంపై ఉన్న తల్లిని కిందకు దింపేసిన కుమారుడు ఉండబట్టలేక ఆమెను ప్రశ్నించాడు. ‘నిన్ను నా భుజంపై మోస్తూ కొండ ఎక్కుతున్నపుడు చెట్ల కొమ్మలను, పువ్వులను తెంపి ఎందుకు పడవేశావో చెప్పు..’ అని అడిగాడు. దానికి ఆ మాతృమూర్తి- ‘నాయనా.. ముసలిదాన్నయిన నన్ను కొండలపై నువ్వు వదిలేసి వెళ్లిపోయినా ఫర్వాలేదు.. మళ్లీ నేను తిరిగి ఇంటికి రాకూడదని చాలా దూరం తీసుకువచ్చావు.. నువ్వు ఒకవేళ దారితప్పి ఇబ్బంది పడతావేమోనన్న భయంతో కొమ్మలు, పువ్వులను తెంపి అలా వేశాను.. ఆ గుర్తులతోనైనా నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లు నాయనా..’ అంది. అందుకే- ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు.. మనసున్నదే అమ్మ.. మంచి కోరేదే

అమ్మ..!ఆ అమ్మ ఉన్నంత కాలం అమ్మని ప్రేమగా చూసుకుందాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: