గర్భం ధరించిన స్త్రీ ప్రయాణం చేయకూడదనీ, ప్రయాణం చేస్తే గర్భ స్రావం అవుతుందన్న భయం చాలా మందిలో ఉంది. గర్భవతి ప్రయాణం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్న అభిప్రా యమూ ఎందరిలోనో ఉంది. కానీ, వర్తమాన సమాజంలో స్త్రీలు కూడా ఎంతో కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నారు.బస్సుల లోనూ, ఆటోలలోనూ, కార్లల్లోనూ, లోకల్‌ ట్రైన్లలోనూ ప్రయాణం చేసి ఆఫీసుకూ, అదేవిధంగా ఇంటికి చేరు కోవాలి కదా! అందుకని, గర్భం ధరించిన సమయంలో స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

 

గర్భిణులు దూర ప్రయాణం ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మూడు నెలలలోపు, నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు. హై బిపి, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు - అటువంటి గర్భవతులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మూడు నెలలు నిండినప్పటి నుంచీ ఎనిమిది నెలల లోపు అవసరమైతే గర్భిణీ స్త్రీ డాక్టరు సలహాతో ప్రయాణం చేయవచ్చు. దూరప్రయాణం చేస్తూ, బస్సు సీటులో ఇరుకుగా అనిపించినప్పుడు, ఎక్కువసేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, బస్సు ఆగినప్పుడు క్రిందకు దిగి కొంత సమయం పచార్లు చేయడం మంచిది.అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎక్కువ దూరం కారులో ప్రయాణం చేయవలసివస్తే మధ్య మధ్య కొంతసేపు కారు ఆపుకొని, ఇటూ అటూ నాలుగు అడుగులు వేయడం, శక్తినిచ్చే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది.

 

ఎనిమిది నెలల నుంచీ, ప్రసవమయ్యే వరకూ గర్భవతి ప్రయాణం చేయడం మంచిది కాదు. మరీ అవసరమైతే విమానంలోనూ, రైల్లోనూ డాక్టరును సంప్రదించి ప్రయాణం చేయాలి. అవసరమైన దూదులు, టానిక్కులు, నెల తప్పినప్పటి నుంచీ తాను వాడిన మందుల చీటీలు, వైద్యపరీక్షకు సంబంధించిన కాగితాలను వెంట ఉంచుకోవాలి.అంటువ్యాధులు ప్రబలిన ప్రదేశాలకు గర్భిణీ స్త్రీలు వెళ్లడం మంచిది కాదు. మలేరియా వ్యాపించి ఉన్న ప్రదేశాలకు గర్భవతి వెళ్లకూడదు. కలుషిత వాతావరణం, నీటి కాలుష్యపు ప్రాంతాలలో గర్భిణీ స్త్రీ గడపడం శ్రేయస్కరం కాదు. ప్రయాణ సమయంలో అనా రోగ్యం కలిగితే డాక్టర్‌ సలహా లేకుండా అతిగా యాంటీ బయాటిక్‌ మందులను వాడటమన్నది గర్భిణి ఆరోగ్యానికే కాక గర్భస్థ శిశువుకు కూడా మంచిది కాదు. ప్రయాణం చేసే సమయంలో కడుపునొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, రక్త స్రావం కనబడినా ప్రయాణం చేయడం ఆపేసి, తప్పనిసరిగా ఆ ప్రదే శంలో ఉన్న డాక్టరుకు చూపించు కోవడమన్నది అతి ముఖ్య విషయం.

 

సాధ్యమైనంత వరకూ, ఏడు నెలలు దాటిన తర్వాత, గర్భవతి ప్రయాణం చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా, వెంట తోడు లేకుండా ఒంటరి ప్రయాణం చేయకపోతే మంచిది..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: