అమ్మ... పేరులో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి మన అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయన మరెక్కడా దొరకదు  కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది.. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది.అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే అమ్మకి మనం ఏమి ఇచ్చిన తక్కువే.

 

అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే  ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే.నాకు మాటలు నేర్పమంటే తను కూడా నాలానే మాట్లాడుతుంది. అమ్మ.. నేను పలికే కొత్త కొత్త మాటలకి అర్థాలు చెప్పే నిఘంటువు.

 

అమ్మ.. చందమామ రాదు అని తెలిసినా.. చందమామ రావే.. అని నా కోసం పిలుస్తుంది.నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు అమ్మ. కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు... పాదాభివందనం!! అమ్మ.. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది అమ్మ.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: