మహిళల వివాహ వయసును పెంచాల‌ని కేంద్రం యోచిస్తుండ‌టంపై వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి భిన్నాభిప్రాయ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాస్త‌వానికి మ‌హిళాభివృద్ధిలో భాగంగానే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంది.ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు.. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలో వివాహం ఒక అడ్డంకిగా మారకుం డా.. చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 1978లో మహిళల వివాహ వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. శారదా చట్టం-1929లోని నిబంధనలను సవరించారు. 1978 నుంచి నేటి వరకు భారత్ మ‌హిళల అభివృద్ధిలో‌ ఎంతో పురోగమించింది. మహిళలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఏర్ప‌డ్డాయి. 

 

మ‌హిళ‌ల వివాహ వ‌య‌స్సును పెంచ‌డం వ‌ల‌న విద్యా,ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు అవ‌కాశం క‌ల‌గ‌డంతో పాటు ఆర్థికంగా స్వావ‌లంభ‌న సాధిస్తార‌ని సామాజిక విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.అయితే దీనివ‌ల్ల సామాజిక ప‌ర‌మైన‌, క‌నిపించ‌ని కొన్ని చిక్కులను నిరుపేద కుటుంబాలు ఎదుర్కొన‌వ‌ల్సి వ‌స్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు కొంత‌మంది చేస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి మరింత పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు మహిళల ఆరోగ్యానికి సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. మహిళల వివాహ వయసు, అమ్మాయిల కనీస వయసును పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 

 


అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి చేయడం.. శిశు మరణాలు, మాతృ మరణాలకు ఒక కారణం అవుతున్నట్లు కేంద్రం ప్ర‌భుత్వం భావిస్తోంది. అనేక రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్న గ‌ణాంకాల‌ను ప‌రిశీలించిన కేంద్రం ఇప్ప‌టికే ప్రాథ‌మిక అవ‌గాహ‌న‌తో ఉంది. అయితే పూర్తి స‌మ‌గ్ర‌మైన నివేదిక‌ను రూపక‌ల్ప‌న చేసేందుకు వీలుగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో శిశు మరణాలు, మాతృ మరణాలతో పాటు సంతాన సాఫల్య రేట్‌, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాయాల‌ని కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించింది. మహిళల వివాహ వయసు, మాతృత్వానికి మధ్య ఉన్న సహ సంబంధాన్ని టాస్క్ ఫోర్స్ తన అధ్యయనంలో పరిశీలిస్తుంది. ఈ రెండు అంశాలతో ముడిపడిన ఆరోగ్యం, వైద్యపరమైన సమస్యలపై దృష్టి సారించ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: