మన చిన్నతనంలో షాంపూకి బదులుగా కుంకుడుకాయలను కేశాల‌ను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లం. కొందరు షీకాయలను వాడేవారు. అయితే షాంపూల రాకతో వాటి వినియోగం కనుమరుగైపోయింది. కానీ తలను శుభ్రం చేసుకోవడానికి అప్పట్లో  కుంకుడుకాయలనే తలకి పెట్టేవారు . దీనివల్ల జుట్టుపై రసాయనాల ప్రభావం పడదు. అంతేకాదు తలస్నానం చేసేముందు కుదుళ్లకు కొబ్బరి నూనె  బాగా పట్టించేవారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సైతం అంత త్వరగా తెల్లబడదు. జుట్టు రాలడమూ తగ్గుతుంది. వేడి నీటిలో కాస్త  కుంకుడుకాయ‌లు, షీకాయ, పెద్ద ఉసిరి గింజల పొడి కలిపి నానబెట్టి దీంతో తలస్నానం చేస్తే.. జుట్టు ఎప్పటికీ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.

 

 


ఇప్పుడంటే మనం చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకొంటున్నాం. కానీ ఒకప్పుడు దానికోసం తాజావెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల స్కిన్ పాపాయి చర్మం అంత లేతగా మారిపోతుంది. పైగా ఒకసారి రాసుకొంటే.. ఆ రోజంతా చర్మం పొడిబారకుండా ఉంటుంది. పొడిబారిన, పగిలిన పెదాలను తిరిగి మామూలుగా మార్చడానికి మనం లిప్ బామ్ ఉపయోగిస్తాం. కానీ ఆ రోజుల్లో వెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి.గంధం  కూడా చర్మానికి మేలు చేసే వాటిలో ఒకటి. దీన్ని కూడా మన బామ్మల కాలంలో ఉపయోగించేవారు. గంధపు చెక్కను సానపై అరగదీసి దాన్ని ముఖానికి రాసుకొనేవారు. చందనం చర్మంపై ఉండే ట్యాన్‌ను తొలగిస్తుంది. మొటిమలు రాకుండా సంర‌క్షిస్తుంది.చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా తయారవ్వడానికి పచ్చిపాలతో గంధపు చెక్కను అరగదీసి ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఛాయ కూడా పెరుగుతుంది.ప్రస్తుతం మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ ఒకప్పుడు తలకు రాసుకోవడానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉపయోగించేవారు. దాన్ని కూడా మార్కెట్లో కొనేవారు కాదు.

 

 



జుట్టు బలంగా, ఒత్తుగా మారడం కోసం కొబ్బరి నూనెలో గోరింటాకు, మందార ఆకు, మందార పువ్వు, గుంటగలగర వేసి మరిగించి చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసి జుట్టుకి రాసుకొంటే జుట్టు దృఢంగా, ఒత్తుగా మారుతుంది.మన శరీరంలో ఎక్కువ ఒత్తిడి పడేది పాదాలపైనే. అందుకే వాటి విష‌యంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గోరింట అరచేతులు, పాదాలను అందంగా మార్చడం మాత్రమే కాదు. దానిలోని ఔషధ గుణాలు ఇన్ఫెక్ష‌న్లు రానీయకుండా చేస్తాయి. గోరింట పాదాల పగుళ్లను సైతం తగ్గిస్తుంది  అంతేకాదు.. గోరింటాకు కుదుళ్లకు పోషణ ఇస్తుంది.దీని వలన చుండ్రు తగ్గడంతో పాటు, జుట్టు తెల్లగా మారడం, జుట్టు రాలే సమస్యలు సైతం రాకుండా ఉంటాయి.
గోరింటను మెత్తగా నూరి తలకు ప్యాక్‌లా అప్లై చేసుంటే.. జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది. దీన్ని మనం తలకు అప్లై చేసుకొనే హెన్నాకు బదులుగా వాడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: