చాలా మంది ఎంతో ఇష్టంగా చేసుకునే వంట గుంత పునుగులు లేదా గుంత పొంగనాలు. ఇది ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఇవి పొద్దున టిఫిన్ లాగా లేదా సాయంత్రం స్నాక్స్ లాగా లేదా రాత్రి డిన్నర్ లాగా అయినా తీసుకోవచ్చు. వీటిని మనం దోశల పిండితో తయారు చేసుకోవచ్చు. కాని ఇప్పుడు మనం ఒక కొత్త రకంగా గుంత పునుగుల పిండిని తయారు చేసుకుని వేసుకుంటున్నాము. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం.
అటుకుల గుంత పునుగులు తయారికి కావాల్సిన పదార్ధాలు:
అటుకులు-ఒక కప్పు,
బొంబాయి రవ్వ-ఒక కప్పు,
పెరుగు-ఒక కప్పు,
అల్లం-కొద్దిగ,
పచిమిర్చి-5,
క్యారెట్-1,
కరివేపాకు-కొద్దిగ,
ఆవాలు-కొద్దిగ,
జిలకర్ర-కొద్దిగ,
ఉప్పు-తగినంత,
ఉల్లిపాయ-2,
కొత్తిమీర-కొద్దిగ,
పసుపు-చిటికెడు,
నూనె-కొద్దిగ,
ఇంగువ-చిటికెడు,
బేకింగ్ సోడా-చిటికెడు,
తయారీ విధానం:
ముందుగా అటుకులను రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత వాటిలో నీళ్ళు పోసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో బొంబాయి రవ్వ మరియు పెరుగు రెండూ వేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం పుల్లటిది తీసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాండీ పెట్టి అందులో కొద్దిగ నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అందులో కొద్దిగ ఆవాలు,జీలకర్ర,సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం,పచ్చిమిర్చి,కరివేపాకు,చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుని, చిటికెడు ఇంగువ వేసుకుని వేయించి పెట్టుకోవాలి.

ఇప్పుడు పక్కన పెట్టుకున్న అటుకులను తీసుకుని మెత్తగా అయ్యేలాగ కలుపుకోవాలి. బొంబాయి రవ్వ, పెరుగు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ అటుకుల మిశ్రమం మరియు వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకుని అందులో చిటికెడు పసుపు,కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు,కొద్దిగ కొత్తిమీర,తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కావాలి అనుకుంటే అందులో కొద్దిగ నీళ్ళని కూడా పోసుకుని గుంతపునుగుల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు బేకింగ్ సోడాని వేసుకుని మరోసారి కలుపుకోవాలి.
.

ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పునుగుల ప్యాన్ పెట్టి అందులో కొద్దిగ నూనె వేసుకుని, కొంచెం వేడయ్యాక మనం తయారు చేసుకున్న బ్యాటర్ ని చిన్న చిన్న పొంగనాలుగా వేసుకుని మూతపెట్టి ఉంచాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకుని మరల గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు ఉంచి తీసి వేయాలి. అంతే ఎంతో రుచికరమైన అటుకుల గుంత పునుగులు రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: