పదహారేళ్ల ప్రాయంలో, స్వదేశాన్ని వీడి అమెరికా చేరిన ఆమె..స్వదేశంపై మమత చంపుకోలేదు. స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనతో భారత్‌కు వచ్చింది. జేపీ మోర్గాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో ఉద్యోగినిగా చేరి న్యూయార్క్‌, లండన్‌లో పనిచేశారు. అత్యంత ప్రతిభతో ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత సమాజం కోసం పనిచేయాలనే తపనతో, 2008లో భారత్‌కు వచ్చి కాంగ్రెస్‌లో చేరి రాహుల్‌ గాంధీతో కలిసి 'ఆమ్‌ ఆద్మీ కా సిపాయి' ప్రాజెక్టు కోసం పనిచేశారు.
తర్వాత మమతా బెనర్జీకి దగ్గరై, ఆ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ మధ్య జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని క్రి ష్ణానగర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈమె అత్యంత సన్నిహితురాలు.
ఆమే త్రుణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా.

ఇటీవల పార్లమెంట్‌లో ఆమె చేసినా ఉపన్యాసానికి దేశమంతా ఫిదా అయింది. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ చట్ట సభలో ఆమె ప్రసంగానికి అధికారపక్షమే ఆశ్చర్యపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ వంటి అగ్రనేతలే ప్రశంసించారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు? మొయిత్రా పార్లమెంట్‌ సెషన్లో తనకిచ్చిన సమయాన్ని ఇటు తమ పార్టీ గొప్పతనం గురించి గానీ, అధికార పక్షంపై విమర్శలు గుప్పించడానికి గానీ ఉపయోగించలేదు. దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న ఏడు సమస్యలను చట్టసభలో లేవనెత్తారు.

అధికార పక్షానికి చెందిన కొందరు ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తనదైన శైలిలో వారికి సమాధానం చెబుతూ....
'దేశాన్ని విభజించాలనే కోరిక',' మానవ హక్కులను కాలరాయడం', 'మీడియా స్వేచ్ఛను హరించడం','కళలను, మేధావుల అణచి వేత ', ' ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోతుండటం' ' పౌరసత్వ వివాదం', ' భయానక వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం', వంటి సమస్యలను ఆమె లేవనెత్తారు. ఒక సినిమా కథను చెబుతున్నట్టు, సమస్యలను అధ్యయనం చేసిన స్కాలర్‌లాగా ఆసక్తిగా వివరించారు.

అమె ప్రసంగాన్ని మధ్యలో కొందరు ఎంపీలు అడ్డుకోవాలని చూసినప్పటికీ..ఆమె నేరుగా స్పీకర్‌తోనే మాట్లాడుతూ, 'సర్‌..ఇది అల్లర్ల అడ్డా కాదు. ఇదో గొప్ప ఆలయం. ఇలాంటి అల్లర్లకు ఇక్కడ స్థానం ఉండకూడదు. దయచేసి వారిని మీరు నియంత్రించండి... ' అని స్పీకర్‌ను కోరగానే ఒక్కసారిగా అన్నిపార్టీల ఎంపీలు కరతాళ ధ్వనులు చేశారు.
చట్టసభలో ఆమె ప్రసంగానికి స్పీకర్‌సైతం చప్పట్లు కొట్టారు. ప్రధాని నరేందమోడీ ఆమెను అభినందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: