అమెరికాలో విడాకులు అనేది పెద్ద విష‌యం ఏం కాదు. ఆ దేశంలో భార్య‌భ‌ర్త‌లు విడిపోవ‌డం మామూలే. భార్యభర్తలు విడిపోతే భార్యకు భర్త నుంచి భరణం రావడం మామూలే. ఈ భరణం ఐదో.. పదో లక్షలుగా ఉండటం సాధారణం. మరికొన్ని కేసుల్లో ఈ మొత్తం ఐదో.. పది కోట్లుగా ఉండొచ్చు. ఇంకొన్ని సంపన్న కేసుల్లో మరింత ఎక్కువ కావచ్చు. కానీ ఏకంగా రూ.2.62 లక్షల కోట్లకుపైగా భరణం అంటే...నోరెళ్ల‌బెట్టాల్సిందే. ఈ వింత అమెజాన్ అధినేత దంపతుల మధ్య జరిగింది మరి. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ (55) దంపతులు విడాకులు తీసుకున్నారు. దీంతో భార్య మెకెంజీ బెజోస్ (49)కు సుమారు 38 బిలియన్ డాలర్లను విడాకుల సమస్య పరిష్కారం కింద జెఫ్ ఇస్తున్నారు.


1993లో జెఫ్ బెజోస్‌, మెకెంజీ బెజోస్ వివాహం జరుగగా, వీరికి నలుగురు పిల్లలున్నారు. 26 ఏళ్లుగా కాపురం చేసిన జెఫ్, మెకెంజీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడిపోదామని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో త‌న భార్య‌కు భ‌ర‌ణం ఇచ్చేందుకు జెఫ్ సిద్ధమ‌య్యారు. ఇందుకోసం ఆయ‌న ఇస్తున్న‌ మొత్తం మన కరెన్సీలో చూస్తే రూ.2,62,048 కోట్లు.  కాగా, విడాకుల నేపథ్యంలో అమెజాన్‌లో ఈ జంటకున్న షేర్లలో 25 శాతం మెకెంజీకి వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో వీటి విలువ దాదాపు 38 బిలియన్ డాలర్లుగా ఉంది. విడాకుల నిర్ణయం సమయంలో 90 రోజుల్లోగా మెకెంజీకి 38 బిలియన్ డాలర్లను ఇస్తానని జెఫ్ ప్రకటించిన సంగతి విదితమే. దీంతో ఈ వారంలో ఆ సొమ్ము మెకెంజీ చేతికి రానుండగా, ఇందులో సగభాగం సంపదను విరాళంగా ప్రకటించింది. వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ఛారిటీ సంస్థకు ఈ సొమ్ము వెళ్ల‌నుంది. 


ఇదిలావుంటే భార్యకు ఇంత భారీ మొత్తంలో భరణంగా వెళ్లినా.. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోసే ప్రథముడని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతున్నది. ఇప్పటికీ జెఫ్ నికర సంపద 118 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నది. 1992లో సీటెల్‌లోని తన గ్యారేజీ నుంచి అమెజాన్ కార్యకలాపాలను జెఫ్ ప్రారంభించారు. ఇది కాలక్రమేణా పెరిగి పెద్దదై...ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ సంస్థగా ఎదిగింది. అలాంటి వ్య‌క్తి త‌న వైవాహిక జీవితం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: