హాలీవుడ్‌డో నటించ బోతున్న తెలుగమ్మాయి... !!
'' మళ్ళీ ఆడపిల్లేనా.. అన్నారు! నేను కడుపులో ఉండగా అమ్మకు నేవీలో ఉద్యోగం వచ్చింది. అందుకే నన్ను మా కుటుంబంలో లక్కీ గర్ల్‌ అంటుంటారు. అయినా మగ పిల్లాడు పుట్టలేదని, మూడో సంతానమూ ఆడపిల్లేనని మా వాళ్ళందరూ నేను పుట్టినప్పుడు బాధ పడ్డారు. కొన్నాళ్ళ తరువాత నేను బాగా చదువుతుండటం, నా గురించి మా టీచర్లంతా బాగా చెప్పడంతో వాళ్ళలో ఆ బాధ పోయింది. అమ్మకు నేవీ ఆఫీసర్‌ ఇంట్లో పని. అప్పుడప్పుడు నన్ను అమ్మతో పాటు తీసుకు వెళ్ళేది. అమ్మ పడే కష్టాన్ని కళ్ళారా చూసేదాన్ని. అమ్మతో పాటు నేనూ వెళ్ళి అమ్మకు పనిలో సాయం చేసేదాన్ని. ముగ్గురం ఆడపిల్లలమైనా మా అమ్మానాన్న.. మమ్మల్ని బాగా చదించారు. '' ...
ఇలా తన గురించి చెప్పడం మొదలు పెట్టింది, వైజాగ్‌కు చెందిన నేవిగేటింగ్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఆఫీసర్‌ స్వాతి పాతర్లపల్లి,
ఆమె జీవితమే ఒక పాఠం,

హాలీవుడ్‌లో ఛాన్స్‌ రావడానికి వెనుక అమె సప్త సముద్రాల మీద చేసిన సాహసం ఉంది. దేశంలో ప్రప్రథమంగా సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహస వనితలుగా కీర్తికెక్కిన టీమ్‌లో తెలుగు మహిళ లెఫ్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతి ఒకరు. ఎనిమిదన్నర నెలలు పాటు 48 వేల కిలోమీటర్లు తెరపడవ ఆసరాగా సముద్ర యానం చేసి, ప్రపంచాన్ని చుట్టి రావడం మాటలు కాదు.

ఇటీవల విజయనగరంలో కలిసినపుడు ఆమె చెప్పిన కథనం ....
'' విశాఖలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం నేవీ బాల్వాడీలో గడిచింది. పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. 2010లో, బిఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసి, ఎమ్సెస్సీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండగానే నేవీ పరీక్షకు వెళ్ళి సెలెక్ట్‌ అయ్యాను. దేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం మహిళా నావికులతో ''నావికా సాగర్‌ పరిక్రమ' పేరిట ప్రపంచ యాత్రను చేయించాలని నిర్ణయించింది.

అందుకోసం ప్రత్యేకంగా ముంబయిలో సెయిలింగ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరిగింది. అనంతరం 2017 సెప్టెంబర్‌ 10వ తేదీన గోవా పోర్టు నుంచి మా సముద్రయానం మొదలైంది. ఎనిమిదిన్నర నెలల పాటు 48 వేల కిలోమీటర్లు సముద్రయానం చేసి, ప్రపంచ దేశాలు తిరిగి 2018 మే 21వ తేదీన గోవా పోర్టుకి చేరుకున్నాం. 43 రోజులు ప్రయాణంలో, ఆస్ట్రేలియా చేరాం. అక్కడ నుంచి న్యూజిలాండ్‌ 25 రోజుల్లో చేరుకున్నాం. అక్కడ నుంచి దక్షిణ అమెరికా వెళ్ళడానికి 45 రోజులు పట్టింది. అక్కడ నుంచి దక్షిణాఫ్రికాకు 30 రోజులు ప్రయాణం చేశాం.

మధ్యలో మా బోట్‌ స్టీరింగ్‌ పాడవ్వడంతో మారిషస్‌కి వెళ్ళాం. అందుకోసం 35 రోజులపాటు ప్రయాణం చేశాం. మారిషస్‌ నుంచి మరో 35 రోజులు ప్రయాణం చేసి, గోవా చేరుకున్నాం. ఈ సాహసయాత్ర ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది. ఇది భారత నావికాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. నా పై జాతీయ స్ధాయిలో మీడియాలో కథనాలు రావడంతో ఇటీవల హాలీవుడ్‌ నుండి కొన్ని సినిమా ప్రతిపాదనలు వచ్చాయి. చర్చలు జరుగుతున్నాయి...'' అని ముగించారు స్వాతి.


మరింత సమాచారం తెలుసుకోండి: