జూనాగడ్‌(గుజరాత్‌)సమీపంలో జలొందర్‌ గ్రామంలో, భయంగా గోలగోలగా ఉంది. కారణం ఊర్లోకి చిరుతపులి వచ్చింది. అది అటు, ఇటు తిరిగి ఏకంగా బావిలో పడింది. నీళ్లలో నుంచి దానిని ఎలా బయటకు లాగాలి, బయటకు తీస్తే అది ఎవరి మీదైనా పడితే...? అని గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారు.

ఎవరో ఈ సమాచారం ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌కి పంపారు. అక్కడి రెస్క్యూ టీమ్‌ కి చెందిన రసిలా వాధేర్‌ వెంటనే నలుగురు జవాన్లతో చిరుత ఉన్న గ్రామం చేరుకుంది. ఆమె చిరుత ప్రాణం పోకుండా దానికి మత్తు ఇంజక్షన్‌ చేసి బోనులో వేసుకొని తిరిగి అభయారణ్యంలో వదిలిపెట్టింది. అందరూ రసిలాను అభినందించారు. ఇది 2013 నాటి ముచ్చట.

ప్రాణుల రక్షణకు రెస్క్యూ టీమ్‌

ఆమె అభయారణ్యం రెస్క్యూ టీమ్‌లో మొదటి మహిళా గార్డ్‌గా చేరినప్పటి నుంచి ఆమె ఇప్పటివరకూ వేయి వణ్య ప్రాణులను రక్షించి, వాటిని తిరిగి ప్రాణాలతో అడవిలో వదిలిపెట్టింది. వాటిలో సింహాలు, చిరుతలు, అడవి దున్నలు, కొండ చిలువలు ఉన్నాయి. గిర్‌ అభయారణ్యం, దాదాపు 1400 చదరపు కిలోమీటర్లు ఉంటుంది నిత్యం ఏదో ఒక జంతువుకు ఏదో ఒక ప్రమాదం ఎదురవుతూనే ఉంటుంది. వాటిని కాపాడడానికే రెస్క్యూ టీమ్‌. ఆ టీమ్‌కు హెడ్‌ రసిలా.

పేదరికం నుండి

రసిలాది జూనాగడ్‌లోని భండోరి అనే కుగ్రామం.పేద కుటుంబం. డిగ్రీ పూర్తి అయినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. 2007లో గుజరాత్‌ ప్రభుత్వం గిర్‌ అభయారణ్యంలో రెస్క్యూ టీమ్‌లో మొదటిసారిగా స్త్రీలకు కూడా అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించడంతో, రసిలా వెంటనే అప్లికేషన్‌ పెట్టింది. ఇంటర్వ్యూ పాసయ్యి, రెస్క్యూ టీమ్‌లో మొదటి మహిళా గార్డ్‌ అయ్యింది.

సింహంతో ఆడుకుంది...

ఆమె, ఉద్యోగంలో చేరింది గాని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో మగవాళ్లు ఆమెను చిన్న పిల్లలాగా ట్రీట్‌ చేయడం మొదలుపెట్టారు. అడవిలోకి వెళ్లడం రిస్క్‌ అన్నట్టుగా వ్యవహరించేవారు. కాని రసిలా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూసేది. దెదాకడీ ప్రాంతంలో ఒక ఆడ సింహం గాయపడి తిరుగుతున్నట్టుగా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందింది. ఆ టైమ్‌కు రసిలా డ్యూటీలో ఉంది. తోటి సభ్యులను తీసుకొని తానే ఆపరేషన్‌లోకి దిగింది. ఆ రాత్రంతా ఎంతో ఓపికతో సింహాన్ని గుర్తించి, దానికి మత్తు ఇచ్చి పట్టుకుంది. అప్పుడు అధికారులకు రసిలా మీద నమ్మకం కుదిరింది. రసిలా సాహసం గుర్తించిన అధికారులు, అభయారణ్యంలో స్త్రీలను ప్రోత్సహించాలని, 150 మంది మహిళా గార్డులను రిక్రూట్‌ చేసుకున్నారు.

వేసవిలో పని ఒత్తిడి..

వేసవి కాలంలో గిర్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆపుడే, కాలంలో మాకు ఎక్కువ వత్తిడి ఉంటుంది అంటుంది రసిలా. ఐదు ఉపనదులు ఈ అభయారణ్యంలో ఉన్నా అవి ఎండి పోతుంటాయి. నీటి జాడ కరువైనప్పుడు జంతువుల కదలిక పెరుగుతుంది. వాటి అవసరాలు రెస్క్య టీమ్‌ చూసుకోవాల్సి వస్తుంది.

'ఎదుటివారు హాని తలపెడతారు అనిపించినప్పుడే అవి అటాక్‌ చేస్తాయి. లేకపోతే ఏమీ చేయవు, నాకు రెండు ఇళ్లున్నాయి. ఒకటి నివసించే చోటు. మరొకటి అడవి...'' అంటుంది ఆ సాహస వనిత.

మరింత సమాచారం తెలుసుకోండి: