సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ ఆమె. నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న, ఆమెకీ ఒక రోజు ఉంది. ఆ రోజు కోసమే కోట్లాది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఆ క్షణాలు ఉద్వేగభరితం.
ఏడాదికోసారి వినిపించే ఆమె మాటల కోసం, అంతా ఊపిరి బిగపట్టి చూస్తారు. ఎందుకంటే ఆమె ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెప్పే మాతంగి స్వర్ణలత. పచ్చికుండతో చేసిన రంగంపైకి ఎక్కి సకల మానవాళి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత తన భవిష్యత్‌ చిత్రపటం గురించి ఈ విలేకరికి ఇలా వివరించారు.
 ఏం చదివారు?
'చిన్న తనంలోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో నాకు కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో సందడిగా ఆ పెళ్లి జరిగింది. ఆ తరువాత నా జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైనది. పదోతరగతి వరకు చదువుకున్న, అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తున్నా. మీ తల్లిదండ్రుల వివరాలు? 'మా నాయిన ఏర్పుల నర్సింహ అమ్మవారి గుడి దగ్గర పంబజోడు వాయించేవాడు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికొచ్చి జేగంట మోగించేది. అమ్మా,నాన్నలు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను,పిన్ని, వదిన, మా తమ్ముళ్లు ఉంటున్నాం.' ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? ౖ' మాది 'ఏర్పుల' వంశం. మొదట ఏర్పుల జోగమ్మతో 'రంగం' మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయం కొనసాగించారు. ఆ తరువాత మా అక్క స్వరూప రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించింది. అక్కతో కలిసి నేను గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే 1997 నుంచి ఇప్పటి వరకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా.'
మీ జీవనం ఎట్లా సాగుతుంది ?
' నేను టైలర్‌ని. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప పూటగడవదు. బ్లౌజులు, ఇతర దుస్తులు కుడతాను. ఎంత కష్టించినా నెలకు రూ.1600 కూడా రావు. తమ్ముడు ఎలక్ట్రీషియన్‌. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు '
ప్రభుత్వం నుండి సాయం ఉందా?
'డబల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామన్నారు. రంగం రోజున ప్రభుత్వం తరుపు నుండి పసుపు కుంకుమ సారె ఇస్తే మంచిగుంటది '
మీరు వివాహం చేసుకోరా ?
' ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను మహంకాళికి సమర్పించుకున్నారు. మా కుటుంబంలో పుట్టే ఆడబిడ్డలంతా అమ్మవారికే అంకితం. మా తమ్ముడుకి ఆడపిల్ల పుడితే, నా తరువాత ఆమే కూడా రంగం ఎక్కుతుంది... ' అని మన వివరించింది స్వర్ణలత.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జూలై 22న 'రంగం' కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.. వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు.
''నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. '' అని భవిష్యవాణి వినిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: