పుట్టి పెరిగింది మారుమూల గిరిజన గ్రామం. ఎంత దూరమైనా కాలినడకే తప్ప మరో సౌకర్యం లేని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం. కానీ... దేశంలోనే తొలి ఆదివాసీ మహిళా కమర్షియల్‌ పైలెట్‌ స్థాయికి ఎదిగింది. ఇంతకీ అనుప్రియ లక్రా ప్రస్థానం ఎలా సాగింది..? ఇంతటి ఉన్నత స్థాయికి ఆమె ఎలా చేరుకుందో ఓ సారి పరిశీలిస్తే.. 


అనుప్రియ లక్రా.. వయస్సు 23 సంవత్సరాలు. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లా వాసి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే మారుమూల గ్రామానికి చెందిన అనుప్రియ కమర్షియల్‌ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్‌ గా చరిత్ర సృష్టించింది.  పైలట్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది అనుప్రియ. 2012లో ఇంజినీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. భువనేశ్వరన్‌లోని పైలట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి... ఏడేళ్ల పాటు కష్టపడింది.  ఈ మధ్యే ఓ ప్రైవేటు ఎయిర్‌ లైన్స్‌లో అనుప్రియకు కోపైలట్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్‌ను నడపనుంది.    


అనుప్రియ కమర్షియల్‌ పైలెట్‌ కావడంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిబద్ధత, పట్టుదలతో తమ కుమార్తె ఈ అరుదైన ఘనత సాధించిందన్నారు. అనుప్రియ తండ్రి మరినియాస్‌ లక్రా... ఒడిశా పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ఆయనే కాదు... ఎందరో మహిళలకు ఆమె ఆదర్శప్రయమంటూ దేశ నలుమూలల నుంచి అనుప్రియపై ప్రశంస వర్షం కురుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: