దీపావ‌ళి అంటే ముందుగా అంద‌రికి గుర్తువ‌చ్చేది ఇల్లంతా దీపాలంక‌ర‌ణ‌తో మంచి మంచి స్వీట్లు గుర్తుకొస్తాయి. ఈ పండ‌గ‌కి ఎక్కువ‌గా ఇంట్లో స్వీట్లు చేసుకోవ‌డం ఆన‌వాయితీ. వెరైటీ వెరైటీ స్వీట్ల‌ను రెడీ చేసి వాటిని టేస్టు చూస్తూ  వ‌చ్చిన చుట్టాల‌కు పెడుతూ ఎంతో ఆనందంగా జ‌రుపుకునే పండుగ దీపాల‌వ‌ళి. ఇక మ‌రి రెగుల‌ర్‌కి భిన్నంగా ఉండే స్వీట్ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం...!


పాల ర‌స‌గుల్లా
కావల్సిన పదార్థాలు:
విరిగిన పాలు - 1 లీటర్
డాల్డా - 200 గ్రాములు
చక్కెర - 400 గ్రాములు
యాలకులు - 4
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో విరిగిన పాలను పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద నీరంతా పోయే వరకు పెట్టాలి. నీరంతా ఆవిరైపోయిన తరువాత పొడి జున్నులాగా అది తయారవుతుంది. దీన్ని తడి చేతులతో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అనంతరం పొయ్యి మీద కళాయి పెట్టి అందులో డాల్డాని వేసి మరిగించాలి. డాల్డా వేడి అయ్యాక అందులో పాల ఉండలు వేసి వేగనివ్వాలి. అప్పుడప్పుడు గరిటెతో కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి. అనంతరం ఒక గిన్నెలో నీరు, చక్కెరని వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో ఉండలు, యాలకుల పొడిని చల్లి ఒక గంట సేపు నానబెడితే పాల రసగుల్ల తయారైనట్టే.
......................................................................................................................................................


పూరీ ల‌డ్డూ
కావల్సిన పదార్థాలు:
మైదా పిండి - 1 కిలో
నూనె - 1 కిలో
చక్కెర - 1 కిలో
యాలకులు - 10
నెయ్యి - 1 కప్పు
తయారు చేసే విధానం:
ముందు మైదా పిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. పూరీ పిండి లాగా దీన్ని కలుపుకుని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. వీటిని పీట మీద రొట్టెల కర్రతో పూరీ లాగా వత్తుకోవాలి. సిద్ధం చేసుకున్న పూరీలను నూనెలో వేసుకుని బంగారు రంగు, క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. తరువాత పూరీలన్నింటినీ కలిపి రోట్లో వేసుకుని దంచుకుని పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో చక్కెర, నీరు వేసి తీగ పాకం వచ్చేలా చేసుకోవాలి. అనంతరం యాలకులను పొడి చేసి ఈ పాకంలో బాగా కలిపి అందులో ముందుగా దంచుకున్న పూరీ పిండిని వేసి మళ్లీ కలపాలి. దించేముందు నెయ్యిని వేసి దించుకోవాలి. వేడి మీద ఉండగానే చేతిని నీటితో తడుపుకుని ఉండలుగా చుట్టుకోవాలి. పూరీ లడ్డూ సిద్ధం అయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: