చర్మం అందంగా ఉంచుకోవడానికి చాలా మంది కేవలం సౌందర్య సాధనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ పోషకాహారం కూడా చర్మ సౌందర్యంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ విషయాలేంటో చూడండి.

 

బాదంలో విటమిన్‌ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కొన్ని బాదం గింజల్ని తీసుకుంటే చాలా మంచిది. చేపలు ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణంలోనూ ఉపయోగపడుతాయి. వీటిలో ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. తరచూ చేపలు తినడం ఎంతోమంచిది. మృతకణాలు తొలగిపోయి కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. చేపలతో పాటూ బ్రకోలీ, చిలగడ దుంపలు కూడా చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి.

 

చాక్లెట్లను తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని ఎక్కువమంది నమ్ముతారు. కానీ ముదురు రంగు చాక్లెట్లు ఒత్తిడిని దూరం చేసి, చర్మానికి మేలు చేస్తాయి. ఈ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించి, మృదుత్వాన్ని సొంతం చేస్తాయి. చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కూడా ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. మనం వంట నూనెల్లో కూడా కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి వాడుకోవచ్చు.

 

అందాన్ని కాపాడుకోవాలనుకునే వారు సాధారణ టీ, కాఫీల కంటే గ్రీన్‌టీని తీసుకోవడం మంచిది. ఈ టీ ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఏజింగ్‌కారకాలుంటాయి. ప్రతిరోజూ కనీసం మూడు కప్పులైనా గ్రీన్‌టీ తీసుకోవాలి. దీన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి పోతాయి. పాలకూరలో ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు, విటమిన్లూ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మం నిగారింపును పెంచుతాయి. రోజూ కాకపోయినా వారంలో మూడు రోజులు పాలకూర తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: