సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి వచ్చే నెలలో తిరిగి నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలో కొన్ని పేపర్లలోని సిలబస్‌లో తెలంగాణ రాష్ట్ర అంశాలకే ప్రాధాన్యం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 374 పోస్టులకు గాను 2011లో గ్రూపు-1 నిర్వహించారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటు ఏపీపీఎస్‌సీ, ఇటు టీఎస్‌పీఎస్‌సీ మళ్లీ ప్రధాన పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నందున ఏపీ చరిత్ర, ఏపీ ఆర్థికాంశాలు అని సిలబస్‌లో పేర్కొన్నారు.



పేపర్ల పేర్లు కూడా ఏపీ పేరిటే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నందున పేపర్-1 జనరల్ ఎస్సేతోపాటు పేపర్-2(చరిత్ర, భారత రాజ్యాంగం), పేపర్-3(భారత ఆర్థిక వ్యవస్థ, ఏపీ ఆర్థిక వ్యవస్థ)లో తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే దృష్టి ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. పరీక్ష సెప్టెంబరు 13-23తేదీల మధ్య పేపర్ల వారీగా జరగనుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. 2011లో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను నిర్వహించగా ఈసారి కేవలం హైదరాబాద్‌లోనే పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది.



పరీక్షల షెడ్యూల్ ఇదీ...
సెప్టెంబరు 13: జనరల్ ఇంగ్లిష్
సెప్టెంబరు 14: పేపర్-1 జనరల్ ఎస్సే
సెప్టెంబరు 17: పేపర్-2 చరిత్ర, భారత రాజ్యాంగం
సెప్టెంబరు 19: పేపర్-3 భారత ఆర్థిక వ్యవస్థ, ఏపీ ఆర్థిక వ్యవస్థ
సెప్టెంబరు 21: పేపర్-4 సైన్స్ అండ్ టెక్నాలజీ
సెప్టెంబరు 23: డేటా అప్రీషియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్



అర్హులు 8,760 మంది
వచ్చే నెలలో జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రాసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 8,760 మందికి అర్హత ఉంటుంది. ఆనాడు హైదరాబాద్‌లో పరీక్ష రాసిన వారిలో 4701 మంది, వరంగల్‌లో 620, విజయవాడ-1003, విశాఖపట్టణం-1342, తిరుపతిలో రాసిన వారిలో 898 మంది మెయిన్స్‌కు అర్హత సంపాదించారు. కీ తప్పులతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరో 196 మంది అదనంగా చేరనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఒకే షెడ్యూల్‌లో పరీక్ష జరుగుతున్నందున అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: