జాబ్ మార్కెట్లో అదనపు అర్హతగా ఉండేందుకు, ఉద్యోగంలో పదోన్నతులకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీలు డిస్టెన్ మోడ్‌లో కోర్సులను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలో ఈ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. ఏ కోర్సులో చేరినప్పటికీ అభ్యర్థుల అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగంతో సుస్థిర కెరీర్‌ను అందుకోవడమే! అభ్యర్థులు కూడా ఇలాంటి కోర్సుల వైపే మొగ్గుచూపుతారు. అందువల్ల విద్యా సంస్థలు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగినట్లు డిస్టెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు డిప్లొమా మొదలు పీజీ స్థాయి వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా విభాగం సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులను అందిస్తోంది. 



పీజీ డిప్లొమా స్థాయిలో కో ఆపరేషన్ అండ్ రూరల్ స్టడీస్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఆఫ్ వలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. దూరవిద్యా విధానంలో ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏలకు డిమాండ్ బాగుంది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉండటంతో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుకు డిస్టెన్స్ మోడ్‌లో ఆదరణ పెరుగుతోంది. భారత సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 2014-15లో దేశంలో ఐటీ-బీపీఎం మార్కెట్ విలువ 20.9 బిలియన్ యూఎస్ డాలర్లు. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే పది శాతం ఎక్కువ. 



ఇలాంటి పరిస్థితుల్లో ఎంసీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. మ్యాథమెటికల్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్/నెట్‌వర్కింగ్, కమర్షియల్ తదితరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎలా ఉపయోగపడతాయన్న అంశాలు ఈ కోర్సులో ప్రధానంగా ఉంటాయి. దేశంలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ఉన్నత విద్యను అందిస్తూ స్థూల నమోదు శాతం (Gross Enrol-lment Ratio-GER) ను పెంచాలన్న సదుద్దేశంతో పనిచేస్తోంది... ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో). డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే రెండు ప్రోగ్రామ్‌లతో 1987లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు దాదాపు 228 సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. 



దేశ, విదేశాల్లోని నెట్‌వర్‌‌క ద్వారా దాదాపు 30 లక్షల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. నిరంతరం మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పరిశ్రమ వర్గాలతో చర్చించి సరికొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో ఏటా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా విధానంలో ఆడియో విజువల్ మెటీరియల్, టెలీకాన్ఫరెన్స్‌లు, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా విభిన్న అంశాలతో విద్యార్థులకు చేరువవుతోంది. ప్రస్తుతం ఇగ్నోలో జూలై సెషన్‌కు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.



తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం.. డిస్టెన్స్ కోర్సుల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగాలు చేస్తున్నవారు, అకడమిక్ అర్హతలు, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంపొందించుకోవాలనుకునే వారికి యూనివర్సిటీ వివిధ కోర్సులను ఆఫర్ చే స్తోంది. భౌగోళికంగా, సామాజికంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉన్నతవిద్యకు దూరమైన వారికి విద్యను దగ్గర చేస్తోంది. ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్’ నినాదంతో విద్యా సేవలు అందిస్తోంది. బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: