సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాలకు ఉపక్రమించింది. రాష్ట్ర విభజన అనంతరం తెదేపా హయాంలో ఏపీపీఎస్సీ నుంచి తొలిసారిగా 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి గురువారం(ఆగస్టు 18) ప్రకటన వెలువడింది. ఈ నియామకాలు రాత పరీక్షల ద్వారానే జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి గిరిధర్ వెల్లడించారు. పేపరు-1, 2, 3 కింద 450 మార్కులకు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
ఉద్యోగాలు...ఏయే శాఖల్లో...! 



ప్రజారోగ్య పురపాలక ఇంజినీరింగ్ విభాగంలో 56, గిరిజన సంక్షేమ శాఖలో 41, జనలవనరుల శాఖలో సివిల్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు 473, మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు 63 ఉన్నాయి. పంచాయతీరాజ్‌లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు 113, భూగర్భ నీటిపారుదల శాఖలో మెకానికల్, వ్యవసాయ ఇంజినీరింగ్‌లో రెండు పోస్టుల వంతున భర్తీచేయనున్నారు. బీటెక్ నేపథ్యంలో పోస్టుల్ని అనుసరించి విద్యార్హతల్ని ఖరారు చేశారు. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం ఆన్‌లైన్ ద్వారా ఈ నియామక రాతలు పరీక్ష నవంబరు మూడు నుంచి ఐదో తేదీ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. సమయ వేళలు నోటిఫికేషన్‌లోఉన్నాయి. 



40 సంవత్సరాల వరకు దరఖాస్తు: 2014 సెప్టెంబరులో జారీచేసిన వయోపరిమితి పెంపు జీవోను అనుసరించి జనరల్ కేటగిరిలో 2016 జులై ఒకటో తేదీ నాటికి 40 సంవత్సరాల వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వయోపరిమితి పెంపు జీవో వచ్చేనెల 30వ తేదీ వరకు అమల్లో ఉంది. సామాజిక వర్గాలు, ప్రత్యేక కేటగిరీల వారి మినహాయింపు వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 



ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి: దరఖాస్తులను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గురువారం నుంచే అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.250 ఫీజు చెల్లించాలి. సామాజికవర్గాలను అనుసరించి ఫీజు చెల్లింపులో కొంత మొత్తం మినహాయింపు ఉంది. 
తెలంగాణ నుంచి ఏపీకి వస్తే: స్థానికతకు పూర్వ పద్ధతినే అనుసరిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీన జారీచేసిన మెమోను అనుసరించి స్థానికతను పొంది ఆధారాల్ని ధ్రువపత్రాల పరిశీలన సమయంలో చూపించాలి. 
ఓటీపీఆర్‌లో వివరాల నమోదు తప్పనిసరి! 



వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)విధానాన్ని ఏపీపీఎస్సీ కొద్దినెలల కిందటే అమల్లోకి తీసుకొచ్చింది. నోటిఫికేషన్ల జారీతో సంబంధం లేకుండా అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. దీనికి స్పందన తక్కువగానే ఉంది. ఇప్పటివరకు 1.5 లక్షల మంది వరకు మాత్రమే వివరాల్ని నమోదు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి నమోదు తక్కువగా ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తొలుత అభ్యర్థులు ఓటీపీఆర్‌లో వివరాల్ని నమోదుచేసుకోవాలి. ఆ తర్వాతనే నోటిఫికేషన్‌ను అనుసరించి దరఖాస్తుల్లో వివరాల నమోదుకు వీలుంటుందని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి మాక్‌టెస్టులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. 



హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రం 
ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లోనూ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించనున్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టుల్ని మాత్రమే భర్తీచేస్తారు. వెయిటింగ్ లిస్టు ఉండదు. తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లయితే వారికి ఐదేళ్లపాటు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు అనుమతినివ్వరు. పరీక్ష నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలతోపాటు దేశవ్యాప్తంగా కమిషన్ల తరఫున జరిగే నియామకాలకు శాశ్వతంగా నిషేధిస్తారు.
ప్రిలిమ్స్ ఉంటుందా! 
ఇంజినీరింగ్ విద్య, అదీ మెకానికల్, సివిల్, వ్యవసాయ కోర్సుల్లో చదివిన వారికి మాత్రమే ఈ నియామకాలు జరుగుతున్నందున దరఖాస్తుచేసే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉంటుందని, దీనివల్ల ప్రిలిమ్స్ నిర్వహణ ఉండకపోవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: