తెలంగాణలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించే ఉద్దేశంతో స్త్రీనిధి బ్యాంకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివి, ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో చేరిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల పిల్లలకే ఈ సదుపాయం వర్తిస్తుంది.

Image result for telangana students
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మండలం నుంచి ఇద్దరు విద్యార్థులకు ఏడాదికి రూ.2,500 చొప్పున రెండేళ్లపాటు ఉపకార వేతనాన్ని అందించనున్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను ఈ నెల 26లోగా సంబంధిత మండల సమాఖ్య లేదా పట్టణ సమాఖ్య కార్యాలయాల్లో సమర్పించాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లాస్థాయిలో ప్రాజెక్ట్ డెరైక్టర్లు/ఐటీడీఏ పీడీలు సేకరించి స్త్రీనిధి బ్యాంకుకు అందజేయాలి. ఒక్కో మండల సమాఖ్య నుంచి స్కాలర్‌షిప్పు పొందే విద్యార్థుల్లో తప్పనిసరిగా ఒకరు ఎస్‌సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్థిని అయి ఉండాలని, మిగిలిన కేట గిరీల నుంచి మరొక విద్యార్థి (బాలుడు/ బాలిక)ని ఎంపిక చేయాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది.

Image result for telangana students

స్కాలర్‌షిప్‌లను పొందే అభ్యర్థుల ఎంపికకు టెన్త్‌లో సదరు విద్యార్థులు సాధించిన మార్కులను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటామని స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు సమాచారాన్ని అందించాలని ఇప్పటికే అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డెరైక్టర్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

 Image result for telangana gov

స్కాలర్‌షిప్‌ల నిమిత్తం ఏడాదికి రూ.50 లక్షలు వ్యయమవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని స్త్రీనిధి బ్యాంక్ లాభాల నుంచి ఖర్చు చేయనున్నట్లు విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థి స్కాలర్‌షిప్‌ను స్వయం సహాయక సంఘంలోని సభ్యురాలి (విద్యార్థి తల్లి) బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని, ఈ మేరకు వారి బ్యాంకు ఖాతా వివరాలను దరఖాస్తు సమయంలోనే స్వీకరించనున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: