వైద్య విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను లో పొందవచ్చు. తాజా ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన రేగళ్ల మానస 152 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, 151 మార్కులతో సికింద్రాబాద్‌కు చెందిన హారిక రెండోస్థానంలోను, అనంతపురానికి చెందిన తేజస్విని మూడోర్యాంకు సొంతం చేసుకుంది.


Image result for eamcet 3

17 నుంచి కౌన్సెలింగ్
నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో అడ్మిషన్లను ఈ నెలాఖరుకే పూర్తిచేయాల్సి ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 17 నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా వారి మొబైల్ నంబర్‌కు పాస్‌వర్డ్ పంపిస్తా రు. విద్యార్థులు 20, 21 తేదీల్లో ఆన్‌లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. నిర్ధారించిన రోజున విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.


Image result for eamcet 3

23, 24 తేదీల్లో బీ కేటగిరీకి ఆప్షన్లు..
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు నేటి నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి 19 వరకు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించి, మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఉస్మానియా వర్సిటీలోని దూర విద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ప్రైవేటు కాలేజీల సంఘం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. సీటు పొందిన వారు వెంటనే మొదటి ఏడాది ఫీజును చెల్లించాలని, మరో ఏడాదికి గ్యారంటీ చూపించాల్సి ఉంటుందని ప్రైవేటు మెడికల్ కాలేజీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నాటికి కాలేజీల్లో చేరాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఎన్నారై కోటా సీట్లకు ప్రత్యేకంగా కాలేజీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: