తెలంగాణ విద్యుత్ సంస్థల్లో మిగిలిపోయిన 240 సహాయ ఇంజినీర్(ఏఈ) ఉద్యోగాల భర్తీ అంశాన్ని ప్రభుత్వం నాన్చుతుండటంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో (జెన్‌కో, ట్రాన్స్‌కో, 2 డిస్కమ్‌ల్లో) దాదాపు 1450 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఒకేసారి మూడు సంస్థల్లో పరీక్షలు నిర్వహించడంతో కొంతమంది అన్నింటికీ ఎంపికయ్యారు. ఏదో ఒకదాన్నే ఎంచుకోవడంతోపాటు కొందరు చేరకపోవడంతో దాదాపు 400కుపైగా ఖాళీలు ఉండిపోయాయి. ప్రస్తుతం జెన్‌కోలో మిగిలిపోయిన ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ల పరిధిలోని ఖాళీలను మాత్రం పూర్తి చేయాలని భావించారు. వాటి సంఖ్య సుమారు 240 దాకా ఉంది. మిగిలిపోయిన ఏఈ ఖాళీలు.. ట్రాన్స్‌కో- 59, ఎస్పీడీసీఎల్- 73, ఎన్పీడీసీఎల్- 107. వీటి భర్తీకి మళ్లీ ఉద్యోగ ప్రకటన, పరీక్ష, ఫలితాలంటే సమయం పడుతుంది కాబట్టి.. ఇప్పటికే జరిగిన పరీక్షలోంచి తయారైన ప్రతిభావంతుల జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు కేటాయించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతిచ్చింది.


Image result for high court telangana

కానీ, దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 81 ప్రకారం ఇలా ప్రాధాన్యక్రమంలో ఉన్నవారికి ఇవ్వడం చెల్లదని.. మిగిలిపోయిన పోస్టులకు మళ్లీ ప్రకటన విడుదల చేసి నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. మిగిలిన పోస్టులకు మళ్లీ ప్రకటన విడుదల చేయాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆలస్యం ఎలాగూ అయ్యింది కాబట్టి అనవసర అనుమానాలకు తావిచ్చే బదులు మిగిలిన ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి, నియామకాలు చేపడదామంటూ విద్యుత్ సంస్థలు కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం విశేషం. కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: