మా వద్ద శిక్షణ తీసుకుంటే ఉద్యోగం గ్యారంటీ...ఉద్యోగం రాకుంటే ఫీజు వాపస్‌ అంటూ గత కొన్నేళ్ల నుంచి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడో మోసకారి. చివరకు శిక్షణ పూర్తయినా ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు వసూలు చేసిన వ్యక్తి కనిపించకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు గురువారం రోడ్డుపై బాఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుల కథనం ప్రకారం ఆదిత్య అనే వ్యక్తి న్యూసైనిక్‌ డిఫెన్స్‌ అకాడమీ పేరుతో కరపత్రాలు ముద్రించి బస్సులకు, రైళ్లకు అతికించాడు. తమ వద్ద శిక్షణ తీసుకుంటే ఆర్మీ, రైల్వే, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగం గ్యారంటీ అని ముద్రించారు. అది నమ్మిన నిరుద్యోగులు వందల మంది శిక్షణ కోసం న్యూసైనిక్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. వీరికి పరిగి రోడ్డులోని ఓ ఇంట్లో అద్దె రూములు తీసుకొని ఉంచారు.


 
అకాడమీలో చేరిన వారి నుంచి ఒకొక్కరి దగ్గర 15వేల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ముందు చేరిన వారి శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం గురించి అడిగితే కొందరు స్థానికులను తీసుకెళ్లి బెదిరించినట్లు బాధితులు వివరించారు. తాము మోసపోయినట్లు తెలుసుకొని స్థానిక ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సుధీర్‌, ప్రవీణ్‌, మధు, వంశీ, ఉదయ్‌, పాండు ఆధ్వర్యంలో పరిగిరోడ్డుపై ధర్నా చేపట్టారు. బాధితులు ధర్నా చేస్తున్నట్లు తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌ఐ దాసుతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: