రాత్రి పూట ఆడవారు ఇంటినుంచి బయటకు రాకూడదని హెచ్చరించిన ఉబర్ డ్రైవర్ తన పట్ల ముస్లిం మత గురువులాగా ప్రవర్తించాడని లండన్ మహిళ ఒకరు పోస్ట్ చేసిన ట్వీటర్ మెసేజ్ మహిళలను ఆగ్రహావేశాల్లో ముంచెత్తుతోంది. ఈ షరియా ఉబర్ డ్రైవర్ గురించి సోషల్ మీడియా విరుచుకుపడటంతో మేల్కొన్న సదరు టాక్సీ సంస్థ ఆ మహిళకు క్షమాపణ చెప్పడమే కాకుండా సంబంధిత డ్రైవరుపై చర్యలకు సమాయత్తమవుతోంది.

 

వివరాల్లోకి వెళితే.. డాక్టర్ హూ అండ్ సిల్క్ వంటి బీబీసీ నాటకాల్లో నటిస్తున్న ఫ్రాన్సిస్ బార్బెర్ అనే నటి లండన్‌లోని ఓల్డ్ విక్ థియేటర్‌లో జరిగిన లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్ థియేటర్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇంటికెళ్లడానికి ఉబర్ టాక్సీని బుక్ చేసుకుంది. కాని తనను ఇంటివద్ద దింపడానికి వచ్చిన ఆ ఉబర్ టాక్సీ డ్రైవర్ తన పట్ల చేసిన వ్యాఖ్యలకు ఆమె బిత్తరపోయింది. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై 58 ఏళ్ల బార్బరా ట్విట్టర్‌లో పెట్టిన ట్వీట్  ఉబర్ సంస్థ పరువు తీసిపడేసింది.

 

రాత్రి పూట మైనస్ 2 డిగ్రీల చలిలో వణుకుతూ తాను ట్యాక్సీ కోసం వేచి ఉంటుండగా తనను ఇంటివద్ద దింపడానికి వచ్చిన ఉబర్ కార్ డ్రైవర్ మహిళలు ఇలా రెచ్చగొట్టే డ్రెస్ వేయద్దని, లేట్ నైట్ ఇంటి బయటకు రాకూడదని సలహాలు ఇవ్వడంతో బిత్తరపోయాని బార్బరా చెప్పింది. తన వ్యక్తిత్వాన్నే అవమానించేలా ఆ డ్రైవర్ తన దుస్తులపై, తన నడతపై వ్యాఖ్యానించడం సహించలేని బార్బరా వెంటనే కారు దిగి తలుపులు గట్టిగా తోసి అతడిని తీవ్రంగా మందలించానని, కానీ జరిగిన ఘటనతో తాను కలత చెందానని బార్బరా చెప్పారు. ఎలాంటి ప్రపంచంలో మనం నివసిస్తున్నామని ఆమె వ్యాఖ్యానించింది.

 

ఈ ఘటనపై వెంటనే బార్బరా ట్విట్టర్‌లోకి ఎక్కించటడంతో గంటలోపే దాన్ని గమనించిన ఉబర్ ట్యాక్సీ యాజమాన్యం ఆమెకు క్షమాపణలు చెప్పడమే కాకుండా సంబంధిత డ్రైవర్‌పై తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ డ్రైవర్ ఏమాత్రం ఆమోదనీయం కాని వ్యాఖ్యానం చేయడం పట్ల తాము షాక్ తిన్నామని ఉబర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అవమానానికి గురైన ఆ మహిళకు తక్షణ సహాయం అందించడానికి  సిద్ధమయ్యామని, ఆమెకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆ డ్రైవర్‌పై తగిన చర్య తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.

 

మహిళలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం కట్టుకోవాలి అనే విషయాలపై నీతి బోధలు చేసేవాళ్లు ఇండియాలో అయినా ఇంగ్లండ్‌లో అయినా ఒకేలా ఉంటారని మరోసారి రుజువు కావడం విచారకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: