పద్య రచనా ప్రక్రియ తెలుగువారి సొంతం. వారికి గర్వకారణం. ప్రభంద సాహిత్యంలో "పారిజాతాపహరణాము" కు ఉన్న విలువ అపారము.  నంది తిమ్మన’ అన బడే అష్ట ధిగ్గజ కవి రచించిన  కావ్యము లోని మాధుర్యాన్ని  క్రింది పద్యం లో ఆస్వాదిద్ధాం.


 అత్యంత సొగసైన ఈయన రచనలు అమృత సమానం అంటారు. "ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు" అని ఇతని బాషా సౌందర్యం గురించి చెప్పుకుంటారు. ఇతనికి మన  కెసిఆర్ లా పెద్ద పొడవైన వెడల్పాటి ముక్కు ఉండటం మూలానముక్కు తిమ్మన’  అని కూడా అంటారు.    

 

కలహభోజనుడైన  నారదుడికి  ఆకలై   సారి రుక్మిణీ సమేతుడై ఉన్న శ్రీ కృష్ణుని దర్శించు కొనే నెపం తో రుక్మిణీదేవి అంతః పురానికి వస్తాడు.   వచ్చేటప్పుడు  శ్రీకృష్ణ  పరమాత్ముని వద్దకు ఖాళీ చేతులతో రావటం ధర్మం కాదని, ఇంద్రుని నందనోద్యానవనము లో ఉన్న పారిజాతమనే వడి వాయని, పరిమళ భరిత పుష్పాన్ని విరగ బూసిన పారిజాత వృక్షం  నుండి  త్రెంచు కుని  “పుష్పంఫలం, తోయం"   ఏదో ఒకటి  పెద్దలను దర్శించు కొనేటప్పుడు సమర్పించుకోవాలని తెస్తాడు.


రుక్మిణి సమేత శ్రీకృష్ణ దర్శనం తో తృప్తి చెంది తన చేత వున్న పారిజాత పుష్పాన్ని పరమాత్మకు సమర్పించి పుష్పం బహు పరిమళ భరితమని వాడిపోదని ఒక్క వర్షం పాటుమాత్రమే భువిలో ఉండగలదని తిరిగి దివికి చేరిపోతుందని చెపుతాడు. దానిని లక్ష్మి స్వరూపిణి అయిన రుక్మిణి ధరిస్తే దాని పరిమళమే ద్విగుణీ కృత మౌతుందని, వేరే అసూయాపరులకు అహంభావుల కివ్వరాదని సత్యభామను అన్యాపదేశంగా ఉటంకిస్తాడు.




అంత కృష్ణుడు చెంతనే ఉన్న రుక్మిణికివ్వటమే సహజమని ఎక్కడో ఉన్నవారికి తీసుకెళ్ళితే రుక్మిణి నొచ్చుకునే అవకాశముందని భావించి జడలో తురుముతాడు. అక్కడే ఉన్న సత్య చెలికత్తె వార్త ను సత్యకు చేరవేసి దానికి చిలవలు పలవ లల్లి సత్య కెంతో అవమానమని దీనికి కృష్ణుడే కారణమని చెప్పటము జరుగుతుంది.


అసలే అబల, ఆపై అసూయ తో సలసల లాడే సత్యభామాదేవి. దాన్నే ... సందర్భములో సత్య ఎలా స్పందిం చిందో పద్యంలో అలంకార ప్రాయంగా ముక్కు తిమ్మన చెప్పిన సందర్భమే పద్యం.


ఇక ప్రతి పదార్ధ సహితం గా విందారగించండి.


"అనవిని వ్రేటువడ్డ ఉరగాంగనయుం బలె, నేయి వోయ

గ్గున దరిగొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె

చ్చిన కనుదోయి కెంపుతన చెక్కుల గుంకుమ పత్ర భంగ సం

జనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంటి యై."



ప్రతిపదార్ధం: 

అన విని = అనగా విని, వ్రేటు = దెబ్బతిన్న, ఉరగం = వయసులో బుసగొట్టే త్రాచు, అంగన యుం = ఆడదైన (ఆడ త్రాచు పాము) వలే = సమానంగానేయి = యజ్ఞ గుండం లో పోసే ఆజ్యం, వోయ= పోయగా భగ్గున = ఒక్కసారిగా భగ్గుమన్న ద్వనితో, దరిగొన్న = అంటుకొన్న, భీషణ = భయంకరమైన, హుతాశన కీల = యజ్ఞ గుండము నుడి ఏగసి పడ్డ అగ్ని కీల (జ్వలించే అగ్నిలో ఒక భాగం), అనంగ = అనేలా, లేచి = నిల్చుని, హెచ్చిన = విప్పారిన, కనుదోయి = రెండు కన్నులు, కెంపు = ఎర్రదనం, చెక్కులు = ఇరు చెక్కిళ్ళపై లేదా బుగ్గలపై, కుంకుమ పత్రం = ఎర్రని కుంకుమ పొడి ఆకు అంతా వ్యాపించిన, బంగ = విధంగా లేదా అతిగా, సంజనిత = ఉద్భవించిన, జన్మించిన, నవీన = క్రొత్త, కాంతి=వెలుగు, తేజస్సు, వెదజల్లగా = వ్యాపించగా, గద్గద = బొంగురుపోయిన గొంతు, ఖిన్న = వేదనతో విలపిస్తూ, కంటి = కన్నులతో లేదా స్త్రీ, యై = మారిపోయి.


 

వ్యాఖ్య:

 నారదుడు చెప్పినది, శ్రీ కృష్ణ పరమాత్మ స్పందన చెలికత్తె అనగా విని తనపై కృష్ణ ప్రేమ తరిగినదని భావించి మహొదృగ్దమైన ఆగ్రహం తో, దెబ్బతిన్న ఆడుత్రాచు పాము లా నేయిపోయగా భగ్గున రగిలిన యజ్ఞవేదికలోని భయం గొలిపే అగ్ని కీలలా ఎగసిపడి లేచి నిల్చుని ఆగ్రహంతో ఎర్రబడి విప్పారిన కన్నులతో ... ఎర్రదనం కుంకుమ అలికిన పత్రాల వలే ఆమె చెంపల చెక్కిళ్ళపై వత్తుగా అలుముకున్నట్లు... కోపంతో కూడిన ముఖారవిందం నవ్య రీతులలో కొత్త తెజస్సును అలుముకొనగా....తనిప్పుడేమీ చేయలేని అశక్తత తో వేదనా భరిత కంఠము నుండి మాటలు రాక బొంగురు పోయిన గొంతుకతో సత్యభామ అనబడే కల కంటి గా మారి బేలై......అని వర్ణించిన పద్యంఆడవాళ్ళు ప్రియవల్లభునితో పోరాడతారు, లేకుంటే అలకతో ఏడుస్తూ తమ పనులు చక్కదిద్దుకుంటారు .... సత్యభామ కూడా స్త్రీనే కదా!


మరింత సమాచారం తెలుసుకోండి: