మన జీవితము లో అనేక మంది గురించి మాట్లాడేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించి అవసరాలు తీర్చుకున్న, తీర్చే వాణ్ణి - వాడు చాణక్యుడు రా! అంటాం.  చాకచక్యంగా, చతురతతో వ్యవహరించి కార్య సాఫల్యత సాధించే ప్రతి ఒక్కడు చాణక్యుడు అవుతాడా? అసలు చాణక్యుడు ఎవరు, ఎలాంటివారు ఆయన? సామర్ధ్యం లోని అనేక పార్శ్వాలేమిటి. కొంచం తెలుసుకొని ఎవరిని చాణక్యుడు అనవచ్చనేది మనం నిర్ణయించుకోవచ్చు


మహ పద్మనందుని ఆదరణ తో నందవంశానికి మహా మంత్రివర్యుడై నందరాజుల సుఖ, సౌఖ్యా లకు, స్వార్ధపరత్వం సాధించిపెట్టటానికి తన తనువు, మనసు, మానం, ప్రాణం, ధనం, విద్య-విజ్ఞానం, పాండిత్యం, చివరకు తన ఆత్మనే ఫణంగా పెట్టి ధారుణంగా ఓడిపోయిన త్యాగశీలి (?) రాక్షసామాత్యుడు.


రాక్షసామాత్యునికి తన సార్వభౌముని సంతృప్తె పరమావధి. పాలన మొత్తాన్ని దిశ - దశ మార్చైనా అనుకున్నది సాధించటానికి సర్వం ఒడ్డి పోరాడి విజయం సాధించగల ధిట్ట. ఇక్కడ  ధర్మ, న్యాయ, చట్టాల ప్రమేయం తృణ ప్రాయం. తాను బహు మేధావి, తక్షశిల విశ్వవిధ్యాలయంలో చాణక్యుని సహపాఠి (క్లాస్-మేట్?).  ఇద్దరి మద్య బలమైన స్పర్ధ ఉంది. (స్పర్ధ అంటే వ్యక్తిగతంగా కాకుండా, విధానాల కోసం ఏర్పడే శతృత్వం)

ఇక చాణక్యుడు దేశ విశాల హితం కోరే మహా విద్వతోత్తముడు. అనూహ్యమైన ఎత్తులు వేసి, పై ఏత్తులను చేదించి, చిత్తుచేసి ముక్క చెక్కలై,  చిన్న చిన్న మండలాలతో మాండలికాలతో కూడిన అనైఖ్య భారత ఉపఖండాన్ని ఏకం చేసిన మహాధీశాలి. ప్రజా బాహుళ్య విశాల హితానికి  విశాల  భారతావని  కావాలని  నిర్మించాలని  కోరుకున్న దేశ హితైషి చాణక్యుడు. 


తన కలల భారతాన్ని సృష్టించి, దానికి తన కలల సార్వభౌముణ్ణి ఒక వ్యక్తిలో పరిపూర్ణంగా నిక్షిప్తం చేసి, చంద్రగుప్తుడనే సామాన్యయువకుణ్ణి, అనన్య సామాన్యుడైన చంద్రగుప్త మౌర్యునిగా తీర్చిదిద్ది, కన్న కలలను సాకారం చేసుకున్న మహనీయుడు చాణక్యుడు. అంతే కాదు తన వ్యూహాత్మక రాజకీయ కౌటిల్యం తో రాక్షసామాత్యుని అంతరంగ మెరిగి ఆయన మదిలోనే చెడు ఆలోచనలకు తావివ్వని పరిస్థితులను ఆయన జీవితకాలమంతా కల్పించి ఆయననే తన కలల చక్రవర్తికి మహామాత్యుణ్ణి చేసిన వ్యూహాత్మక కౌటిల్యం నెరపటం మరపురానిది.


ఇక్కడ దేశ విశాల హితం తప్ప వ్యక్తిగత వృత్తిగత స్వార్ధాలకు ఇసుమంతైనా స్థానం లేదు అందుకే ఆయన కౌటిల్యుడైనాడు. తనకలల భారతాన్ని పరిపాలించటానికి, నిఘూడ ఆర్ధిక, రాజకీయ, సాంఘిక పరిపుష్ఠి సుదూర ఆద్యాత్మికతను రంగరించి స్వయంగా ఆచార్యుడైన తాను రచించినదే "అర్ధశాస్త్రం"


గమనిస్తే రాజ్యం లేనిచోట రాజ్యాన్ని, దానికి సరైన చక్రవర్తిని, అద్భుతమైన అనుభవశాలైన మహామంత్రిని, సుపరిపాలనా విధానాలను అందించటానికి అర్ధశాస్ర గ్రంధాన్ని సృష్టించాడు చాణక్యుడు. చాణక్యుడు తనకోసం, తన భార్య కోసం, తన వారసుల కోసం ఏమాత్రం జీవించలేదు. జీవితమంతా జనవిశాల హితమే. క్రీ.పూ. నాలుగవ శతాబ్ధం నాటికి 100 వరకున్న నాగరిక సార్వభౌమ రాజ్యాలు, 1000 కి పైగా పర్వత, ఆటవిక, గిరిజన, కిరాతక రాజ్యాలతో భారత్  అసంఘటితం గా ఉండే రోజులవి. పదుల సంఖ్యలో లిపి ఉన్న భాషలు, 1000 వరకు లిపి లేని భాషలు, విభిన్న జీవన విధానాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారల తో భారత్ విలక్షణ  వ్యత్యాసాల తో ప్రతి చిన్న రాజ్యం ప్రక్కనున్న ఏ రాజ్యం తోనూ సయోధ్య లేకుండా విరోధాలతో అశాంతి, అలజడి, అసంతృప్తులతో నిండి ఉన్నరోజులవి.


తక్షశిల, మగధ, కళింగ, అంగ, వంగ, కంబోజ లాంటి రాజ్యాలలో నాగరికత, సంస్కృతులు మూర్తీభవించి సకల సంపదలు, మహోన్నత భవనాలు, ఆకాశ హర్మ్యాలతో దివిలోని ఇంద్రపురి లాంటి నగరా లెన్నో ఉన్నాయి. కాని వాటి మధ్య సయోధ్య లేక పోవటం వలన దేశం అంతర్గతంగా రాజ్యాల మధ్యే కాక విదేశాల నుండి హూణులు, దగ్గులు, పిండారీలే కాక తరచు యవన జాతులు భారత్ పై దాడులు చేయటం సహజం. వీరు భారత్ లోని రాజుల మధ్య ఉన్న అంతర్గత విభేధాలను వాడుకొని మరిన్ని సమస్యలు దేశములో సృష్టిస్తుండేవారు. మగధ రాజ్యం నందుల పాలనలో ఉండేది.  చాలా బలమైన రాజ్యం.


చాణక్యుడు గొప్ప పరిశీలన కలిగిన అలోచనా పరుడైన రాజకీయ ఆర్థశాస్త్ర, నీతి శాస్త్ర వేత్త. అంతేకాదు గొప్ప దార్శనికుడైన విజ్ఞుడు. భారత ఉపఖండాన్ని (జంబూద్వీపం అంటారు) అంటే నేటి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బుర్మా, నేపాల్, భూటాన్, అఫ్ఘనిస్తాన్, శ్రీలంక కూడి ఉన్న హిందూ రాజ్యం. అప్పుడే దేశంలో జైనిజం, బుద్ధిజం వేళ్ళూనుకుంటున్న రోజుల్లో ఒక ప్రక్క అద్భుతమైన నాగరికతతో విలసిల్లే నగర రాజ్యాలు, మరోపక్క అనాది సంస్కృతులతో విలసిల్లే ఆటవిక, కిరాత, పర్వత, గిరిజన జనపదాలతో ఒకరి పొడ మరొకరికి గిట్టని రోజుల్లో దేశ ఐఖ్యత కోసం, ఒక రాజును, రాజుకోసం రాజ్యాన్ని, రాజ్యపాలన కోసం అర్థశాస్త్రాన్ని, రాజ్యపాలన కోసం శతృవు ఐన రాక్షసామాత్యుని మనసులోనే తనకు కావలసిన విధంగా మార్పు తెచ్చి (హ్యూమన్ మైండ్ ఈజ్ మానిపులేటెడ్ టూ సూట్ టూ హిజ్ కింగ్) -ఇదంతా స్వప్రయోజనం కోసం కాక దేశ విశాల హితం కోసం చేయగల వారిప్పుడున్నారాఅలాంటి వ్యక్తే ఇప్పుడవసరం దేశానికి దాని హితానికి.


 కురుక్షేత్రయుద్దం తరవాత మనదేశం చవిచూసిన యుద్ధమే ఐఖ్య భారతావని సాధనకు చంద్రగుప్తుని నాయకత్వములో, చాణక్యుని నేతృత్వములో సాగిన ఈ మహోదృత ఉద్యమ సంగ్రామంఇది జరిగి సుమారు 2500 సంవత్సరాలైంది.


అనేక సందర్బాలలో కీర్తి శేషులైన మన ప్రియతమ భారత రాష్ట్రపతి అబ్డుల్ కలాం అనే  మాట "మనదేశం 2500 సంవత్సరాలుగా ఉద్ధమే చేయక పోవటానికి కారణమేమిటని అనేక విశ్వవిద్యాలలో విద్యార్ధులను ప్రశ్నించేవారు”  దానికి సమాధానం చాణక్యుడు ఆధ్యాత్మికతను కలగలిపి రూపొందిన అర్ధశాస్త్రమే.  విశ్వానికి - ఏనాడో ఈనాటి ఏకనమిక్స్ నేర్పిన సుదూర స్వాప్నికుడు చాణక్యుడుఉరఫ్ కౌటిల్యుడు.  ఆయనను రాక్షసామాత్యునితో పోల్చటం కూడా సరికాదు.


ఒకే ఒక్క చాణక్యుడంతటి వ్యక్తి దేశానికి చాలా అవసరం. అబ్దుల్ కలాం తాను పర్యటించిన విద్యార్దుల లో దేశం పట్ల, దేశ హితం పట్ల ఎన్నో నూతన భావావిష్కరణలను ప్రోత్సహించారు. ఆయన రాసిన గ్రంధాలుకుడా అనేక నవ్య ఆవిష్కరణలకు దారి తీశాయి. కాని ఇంకెంతో చేయవలసిన అవసరముంది.


దేశమంతా రాజకీయ అరాచకసం, స్త్రీలపై లైంగిక హింస, హత్యలు, పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజల మద్య పెరుగుతున్న భయంకర ఆర్ధిక అసమానతలు, కుల జాడ్యం, మత మహమ్మారి, రిజర్వేషన్ల పేరుతో ప్రతిభావంతులకు ఎదిగే అవకాశం చేజార్చటం, గూండా, రౌడీఇజం, మత్తు పదార్దాలు, మహిళల అక్రమ రవాణా, దేశ భూసంపద అనేక పద్దతుల్లో అక్రమ దురాక్రమణలు, భూగర్భ ఖనిజాలు, లవణాలు అక్రమ త్రవ్వకాలు, తరలింపు, ఎర్రచందనం వంటి విలువైన వృక్ష జాతుల నిర్మూలన, తరలింపు ఇలా యెన్నో దుష్కృత్యాలను అదుపు చేయలేని ప్రభుత్వాలున్న రాజ్యానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చాణక్యుని అవసరమున్న సరైన తరుణమిది.


ఇప్పుడున్న మన రాజకీయ నాయకుల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకడని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పొచ్చు. కనీసం తనరాష్ట్రం కోసమైనా పని చేయగల వారున్నారా! అదీ లేదు. నిరీక్షిద్ధాం నాయకుని రాక కోసం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: