ఉప్పుతో రక్తపోటు సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొక ముప్పు కూడా ఉంది, అంటే అందరూ షాక్ అయ్యే విషయమే. ఉప్పుతో డయాబిటీస్ ముప్పు ఉంది అన్న విషయాలు ఇప్పుడు సరికొత్త పరిశోధనలు ద్వారా బయటపడుతున్నాయి. కూర చప్పగా ఉందనో పెరుగు వేసుకున్నామానో ఉప్పు వేసుకోవాలని చూస్తే మన చేతులతో మనమే కోరి మధుమేహాన్ని ఆహ్వానించినట్లే అని అంటున్నాయి అధ్యయనాలు.

కేవలం చక్కరతోనే కాకుండా ఉప్పుతో కూడ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని కొన్ని వైద్య సంస్థలు చేసిన అధ్యయనంలో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఉప్పు ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకునేవారితో పోలిస్తే ఈ సోడియాన్ని ఉప్పు వాడకం ద్వారా ఎక్కువగా తీసుకునే వారిలో 70 శాతం మందికి పైగా మధుమేహం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 

అంతేకాదు వీరి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడ తక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీనితో వీలైనంత వరకు మనం తినే ఆహార పదార్ధాలలో తక్కువగా ఉప్పు ఉపయోగించడం అధిక రక్తపోటు వ్యాధి గ్రస్తులకే కాకుండా మధుమేహం ఉన్నవారికి కూడ మంచిది అని అంటున్నారు పాశ్చాత్య వైద్య పరిశోధకులు. ముఖ్యంగా మనం రోజుతినే ఆహార పదార్ధాలలో 1,500 మిల్లీగ్రాముల సోడియం మించకుండా చూసుకోవడం ఎంతైన మంచిది అని అంటున్నారు. 

ముఖ్యంగా ఊరగాయలు చిరుతిళ్ళు లాంటి వాటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో పాటు రుచి కోసం భోజనం చేసేడప్పుడు అదనంగా ఉప్పు కలుపుకోవడం మిరియాల పొడి లాంటి వాటిని కూడ ఎక్కువగా జల్లుకోవడం అలవాటు ఉన్నవారు ఈ అలవాట్లవల్ల కూడ మధుమేహ వ్యాది బారిన పడతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కనుక ఉప్పు వాడకం ఎక్కువగా ఉన్నవారు అతిజాగ్రత్తగా తింటూ ఉప్పును అతి పొదుపుగా వాడుకోవడం ఎంతో మంచిది..   



మరింత సమాచారం తెలుసుకోండి: