మూడు దశాబ్దాల పైగా టాప్ కమెడియన్ గా సినిమా రంగాన్ని ఏలుతూ ఉన్న నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. తాత్వికులలో బుద్ధుడు, ఆయుర్వేదంలో ధన్వంతరి, ఖగోళ జ్ఞానంలో వరహమిహిరుడు, సాహిత్యంలో పోతన నుంచి చాగంటి వరకు ఇలా ఎటువంటి విషయం పైన అయినా సుదీర్ఘంగా మాట్లాడగల టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం నేటితో తన 60వ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనలోని మరో కోణాన్ని బయటకు తీసాడు.

జీవితం ఎక్కాల పుస్తకం కాదు అంటూ అదో పెద్దబాలశిక్ష అంటూ తనలోని వేదాంతిని బయటకు తీసాడు బ్రహ్మానందం. తనకు గతాన్ని మార్చే శక్తి లభిస్తే దేశంలోని ప్రజలను పిల్లలుగా మార్చివేసి మళ్ళీ అక్షరాభ్యాసం జరిపించాలని తన పగటి కల అని కామెంట్ చేసాడు బ్రహ్మి. అంతేకాదు మరణం నుంచి అమరత్వానికి నడిపించే మార్గం గురించి తెలుసుకోవాలని తన కోరిక అని అంటున్నాడు ఈ నవ్వుల వేదాంతి.

టాప్ హీరోల నుండి యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ కోట్ల పై పారితోషికం తీసుకునే బ్రహ్మానందానికి ఇప్పటి సినిమాలను చూడటం అంటే పెద్దగా ఇష్టం ఉండదట. తనకు ‘డాక్టరు చక్రవర్తి’, ‘మల్లీశ్వరి’, ‘సువర్ణ సుందరి’, ‘మాయాబజారు’, ‘రాజమకుటం’ లాంటి టాలీవుడ్ క్లాసిక్స్ లోని పాటలంటే ఇష్టం అని చెపుతున్నాడు బ్రహ్మి.

బ్రహ్మీతో ఫోటోలు తీయించుకోవాలని ఆటోగ్రాఫుల పై సంతకాలు పెట్టించుకోవాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకుంటే తనకు అవకాశం వస్తే కాలచక్రం వెనక్కు తిప్పి ఏడుగురు మహానుభావులను కలిసి వారితో ఫోటోలు తీయించు కోవాలని కలలు కంటున్నాడు బ్రహ్మి. ఆదిశంకరాచార్యులు, బమ్మెర పోతన, వేమన, అల్లూరి సీతారామరాజు, సర్ ఆర్ధర్ కాటన్, మధర్ ధెరీసా, చలం లాంటి 7 గురు మహానుభావులను కలవాలని ఉంది అని చెపుతున్న బ్రహ్మీ కోరిక వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ నవ్వుల రారజులోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఎపి హెరాల్డ్ ఈ నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: