Jai SriRam: English Full Review

‘చిత్రం’, ‘నువ్వునేను’, ‘మనసంతా నువ్వే’ వంటి వరుస చిత్రాల విజయాలతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. అలాంటి కెరియర్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. ఈ ఉదయ్ కిరణ్ తాజాగా నటించిన సినిమా ‘జై శ్రీరామ్’. ఈ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!     చిత్రకథ :     శ్రీరామ్ (ఉదయ్ కిరణ్) సిన్సియర్ పోలీసాఫీసర్. అవయవాల వ్యాపారం చేస్తున్న ఒక రాజకీయనాయుకున్ని ఆధారాలతో సహా పట్టుకుంటాడు. అయితే ఆ ఆధారాలను తమకు ఇమ్మని పై ఆధికారులు, ఆ రాజకీయనాయకుడు శ్రీరామ్ ను బంధిస్తారు. ఆ చెర నుంచి శ్రీరామ్ ఎలా తప్పించుకున్నాడు...?, ఆ దుండగుల్ని ఎలా అంతం చేశాడు అన్నదే ఈ చిత్ర కథాంశం.  

advertisements


నటీనటుల ప్రతిభ : లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఇటీవల కాలంలో యాక్షన్ హీరో ఇమేజ్ కోసం కృషి చేస్తున్నాడు. ఆ క్రమంలో వచ్చిందే ఈ చిత్రం. ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. అతని గెటప్ బాగుంది. యాక్షన్ సీన్లలోనూ కష్టపడి నటించాడు. అయితే సినిమా కథ, కథనం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. రేష్మ ఈ సినిమాలో కార్యెక్టర్ యాక్టర్ గా కనిపిస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ రేష్మ పోషించిన పాత్ర తెర మీద కనిపిస్తూ ఉన్నా ఆ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రపీ, సంగీతం చాలా సాధారణంగా ఉన్నాయి. ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక పాట వస్తుంది. అవి అంతగా మెప్పించవు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. కథ, కథనం మీద దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. సిన్సియర్ పోలీసాఫీసర్ కథను తీసుకుని ఉదయ్ కిరణ్ ను ఒక యాక్షన్ హీరోగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఉదయ్ కిరణ్ ప్రేక్షకులను మెప్పించినట్లు కనిపిస్తున్నా కథ, కథనాలు నిరాశగా ఉండటంతో చివరకు సినిమా ముగిసే సరికి చప్పగా అనిపిస్తుంది. విశ్లేషణ :     ఇటీవల కాలంలో కొంత మంది యువహీరోలు మాస్, యాక్షన్ హీరో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి సినిమాల్లోనే నటిస్తున్నారు. మాస్ హీరో గుర్తింపు అనేది అందరి హీరోలకు రాదు. దానికి ఎన్నో కలిసిరావాలి. మాస్ హీరో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ తమకు ఉన్న ఇమేజ్ ను కూడా ఈ హీరోలు పాడుచేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఈ జై శ్రీరామ్ సినిమా చూసినప్పుడు ఇదే అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ఇలాంటి సినిమా కన్నా ఉదయ్ కిరణ్ తనకు కలిసి వచ్చిన ప్రేమకథా చిత్రంలో నటిస్తే ఫలితం ఆశించినవిధంగా వచ్చేదేమో..!  చివరగా : ‘జై శ్రీరామ్’ ఫలితం : ఉగాది పచ్చడిలో వేపపువ్వు   

More Articles on Jai SriRam || Jai SriRam Wallpapers || Jai SriRam Videos


మరింత సమాచారం తెలుసుకోండి: