సినిమా పూర్తిగా చూడగలగడంసినిమా పూర్తిగా చూడగలగడంపూర్తిగా సినిమా చూడవలసి రావడం

నిజానికి ఈ చిత్రం బెంగుళూరు లో జరిగిన ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు, కథావస్తువు ఏంటంటే రేను(తేజస్వి) మెడిసిన్ చదువుకునే ఒక అమ్మాయి ఈ మధ్యనే రేను కుటుంబం ఇల్లు మారి ఒక పెద్ద ఇంట్లోకి వస్తారు. కాగా రేను తల్లిదండ్రులు బంధువుల పెళ్ళికి వెళతారు రేనుకి పరీక్షలు ఉండటంతో ఇంట్లోనే ఉండిపోతుంది. అక్కడ గతంలో ఉన్నవారు పూజలు చేయించి ఒక బొమ్మని ఉంచుతారు వారికి ఆ ఇల్లు చూపించిన ఏజెంట్ వాటిని కదపకూడదు అని చెపుతాడు. ఇది తెలియక రేను బాయ్ ఫ్రెండ్ అయిన విశాల్(నవదీప్) అనుకోకుండా దాన్ని తన్నేస్తాడు. అప్పటి నుండి రేను ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకోడం గమనిస్తుంది. ఇదిలా నడుస్తుండగా విశాల్ మాత్రం రేను ఇది మానసిక సమస్య మాత్రమే అని చెప్తూ ఉంటారు కాని రేను మాత్రం ఆ ఇంట్లో దయ్యాలు తిరుగుతుండటం గమనిస్తుంది.. అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా? లేకపోతే విశాల్ అన్నట్టు అది రేను మానసిక సమస్య అన్నది తెర మీద చూడవలసిన అంశాలు ...

ఈ చిత్రం దాదాపుగా తొంభై శతం ఒక్క పాత్ర మీదనే నడిపారు ఆ పాత్రలో చేసిన తేజస్వి కొన్ని చోట్ల బాగా చేసినా కొన్ని చోట్ల అనవసరమయిన అతిని ప్రదర్శించింది. అందాలను ప్రదర్శించే విషయంలో మాత్రం నూటికి నూరు శాతం న్యాయం చేసింది. నవదీప్ ఉన్నంతలో ఏదో నటించాలి కాబట్టి నటించినట్టు (అంటే ఫార్మల్ గా అన్నమాట) అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న ప్రధాన పాత్రలు వీరిద్దరే వీరు కాకుండా ఒక ముసలి దయ్యం(సరస్వతమ్మ), పని మనిషి(సందీప్తి), ఆమె తమ్ముడు, ప్లంబర్(చంటి), ఒక పిల్లి నటించారు ఎవరి పరిధి మేరకు వారు కనిపించారు. వీరు కాకుండా ప్రాణం లేనివి కూడా ఈ చిత్రంలో నటించాయి ఒక పియానో, కొన్ని మెట్లు, కొన్ని బొమ్మలు, బాత్ రూమ్ అద్దం .. ఇలా వస్తువులే ఈ చిత్రానికి స్క్రీన్ ఫిల్లర్స్ అన్నమాట..

ఈ చిత్రం ద్వారా రెండు నూతన సాంకేతిక అంశాలను తెలుగు తెరకు పరిచయం చేసారు ముందుగా వాటి గురించి మాట్లాడుకుందాం..

ఫ్లో- క్యాం సాంకేతికత : మధ్యలో ఎటువంటి కట్ లేకుండా పొడవయిన సన్నివేశాలను చిత్రీకరించడం ఈ సాంకేతికత యొక్క ప్రత్యేకత నిజానికి దయ్యం చిత్రాలలో ఇటువంటి సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది కాని దాన్ని ఉపయోగించే విధానం మీద అది ఆధారపడుతుంది. కొత్త టెక్నాలజీ కదా అని అదే పనిగా అవసరం ఉన్నా లేకపోయినా పదే పడదే ఉపయోగిస్తే దాని ప్రాముఖ్యత తెలియకపోగా విసుగు వచ్చేస్తుంది.. ఐస్ క్రీం లో అదే జరిగింది నిమిషానికి రెండు సార్లు ఈ సాంకేతికతను ఉపయోగించారు..

ఫ్లో - సౌండ్ : మొదట్లో అర్ధం కాకపోయినా చిత్రం కాసేపు గడిచాక మెల్లగా గమనించవచ్చు శబ్దం ఒకవైపు నుండి మరొక వైపు అలా ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సాంకేతికత కూడా దయ్యం చిత్రాలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా అతిగా వాడుకోవడం వలన దీని ప్రాముఖ్యత కూడా తెలియకుండా పోయింది.

ఇక మిగిలిన అంశాల విషయానికి వస్తే నిజ జీవిత అంశాలను తీసుకొని చేస్తున్నారు కాబట్టి కథలోపం అంటూ చెప్పడానికి ఎం లేదు కథనం విషయానికి వస్తే మొదటి పది నిమిషాల్లో ఉన్న కథను చెప్పేసి ఆ తరువాత చివరి వరకు చెప్పిందే చెప్పి భయపెట్టాలి అన్న ఆలోచన ఎవరికీ వచ్చిందో కాని, అది పక్కన పెడితే హారర్ సినిమాలో హారర్ లేకపోగా థ్రిల్లింగ్ గా కూడా ఎం లేకపోవడం ఏంటో .. ఈ చిత్రానికి డైలాగ్స్ అనే విభాగమే లేదు పాత్రలకు సన్నివేశాన్ని వివరించి ఇలాంటి సన్నివేశంలో మీరేం మాట్లాడగలరో అది మాట్లాడండి అని చెప్పినట్టు చాలా నీట్ గా కనిపించేస్తుంది. కొన్నిసార్లు ఈ ఫార్ముల బాగా పని చేసిన చాలా సన్నివేశాలకు నప్పలేదు.. సినిమాటోగ్రఫీ చాలా నాసిరకంగా ఉంది.. సంగీతం విషయంలో అనవసరమయిన స్థాయిలో నేపధ్య సంగీతం అందించారు. చెవులు అదిరిపోయేలా ఇచ్చిన ఈ నేపధ్య సంగీతం వలన భయపడేది ఉండదు కాని తల నొప్పి కచ్చితంగా వస్తుంది.. ఈ చిత్రాన్ని చాలా కత్తిరించినా కూడా ఇంకా చాలా కత్తిరించి ఉంటె బాగుండేది అన్న ఫీలింగ్ కలిగించారు ఎడిటర్.. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేదు..

రామ్ గోపాల్ వర్మ , భారతదేశ చలన చిత్ర పరిశ్రమకి దొరికిన ఆణిముత్యం అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు కాని అతను ఈ మధ్య కాలంలో చేస్తున్న చిత్రాలను చూస్తుంటే అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడుతున్నారు నిజానికి ఈ విషయాలు ఆయనకి అనవసరం అనుకోండి అసలు విషయానికి వస్తే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చేతిలో ఉన్న పదునయిన ఆయుధం "కెమెరా" శివలో కార్ వెనుక కెమెరా పెట్టి చిత్రాన్ని మొదలెట్టడం నుండి అయన అన్ని చిత్రాలలో సన్నివేశాలలో ఎమోషన్స్ ని కెమెరా తోనే రాబట్టుకోగలరు కాని ఇప్పుడు అయన తన ఆయుధంతో తన తలనే నరికేసుకోవడమే కాకుండా ప్రేక్షకుల తల కూడా నరికేస్తున్నాడు. అవును అయన చిత్రంలో అదే పనిగా అవసరం లేని యాంగిల్స్ నుండి ప్రాముఖ్యత లేని అంశాలను పదే పదే చూపించి వాటి ప్రాముఖ్యతను పెంచాలని ప్రయత్నిస్తున్నాడు,ఈ సదరు ఐస్ క్రీం అనే చిత్రంలో తేజస్వి శరీరం మీద నుండి కెమెరా ను పక్కకు తిప్పిన సన్నివేశాలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇంకా ఫ్లో సౌండ్ టెక్నాలజీ అంటే సన్నివేశంతో సంభంధం లేకుండా ఫ్లో లో వచ్చిన సౌండ్స్ అన్ని ఉపయోగించడం ఏమో అనిపిస్తుంది. నిజానికి ఈ రెండు టెక్నాలజీ లు చాలా ఉపయోగకరమయినవి వీటిని సరిగ్గా ఉపయోగిచి హారర్ చిత్రాలను తెరకెక్కిస్తే మంచి ఫలితాలు వస్తాయి. గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ తను ఎంత చెత్తగా చిత్రాలను తీయగలడో అని పరీక్షిస్తున్నట్టు కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే ఆయన ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎక్కి ఇంకా చెత్తగా తీస్తున్నారు. మరి ఈ "పరిక్షలు" ఎప్పుడు అయిపొతాయో ఆయనకే తెలియాలి. మీరు మీ జీవితంలో అతి చెత్త హారర్ చిత్రం అని ఏ చిత్రాన్ని అయిన అనుకుంటే "ఐస్ క్రీం" కన్నా ఆ చిత్రం వంద రెట్లు బాగుంటుంది. ఈ చిత్రాన్ని చూడాలా వద్దా అని కాదు చూడగలమా? చూసి తట్టుకోగలమా? వంటి ప్రశ్నలు వేసుకోండి.. ఒకవేళ మీక్కూడా హారర్ చిత్రాలను తెరకెక్కించే ఉద్దేశాలు ఉంటె ఈ చిత్రంలోని ఫ్లో క్యాం మరియు ఫ్లో సౌండ్ సాంకేతికతను గమనించడానికి ఒకసారి ప్రయత్నించవచ్చు..

Navdeep,Tejaswi Madivada,Ram Gopal Varma,Rama Satyanarayana.ఐస్ క్రీం - భయపెట్టలేదు... విసిగించింది...

మరింత సమాచారం తెలుసుకోండి: