నిర్మాణ విలువలు , సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు , సినిమాటోగ్రఫీ పైవి కాకుండా అన్నీ సంజు (సందీప్ కిషన్) హైదరాబాద్ లో పెద్ద వ్యాపారవేత్త కొడుకు, ఏ పని చెయ్యకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో సూర్య నారాయణ(సీనియర్ నరేష్)కి వ్యాపారంలో పెద్ద సమస్య వచ్చి పడుతుంది దాని నుండి కాపాడమని విజయవాడలోని ఆదికేశవులు(ముఖేష్ రుషి) దగ్గరకి వెళ్తాడు.. ఆ సమయంలోనే సంజు గాడు ఆదికేశవులు కూతురు అయిన స్వాతి(సురభి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇదిలా సాగుతుండగానే ఒకరోజు సంజు మరియు స్వాతిలు పారిపోతారు. అప్పటి నుండి ఆదికేశవులు మరియు విజయవాడకి కాబోయే ఎంఎల్ ఏ అయిన అజయ్(అజయ్) సంజుని చంపాలి అనుకుంటారు. అసలు ఎమెల్యే అజయ్ కి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? సంజుకి స్వాతి మధ్య ఏం జరిగింది? ఈ కథకి దీపు(అనీష సింగ్)కి ఉన్న సంబంధం ఏంటి? అనేవి చిత్రం చూస్తే తెలుస్తుంది... ప్రస్థానం చిత్రంలో ప్రదర్శనతో అందరి మన్నన్నలు పొందిన సందీప్ కిషన్ ఆ తరువాత ఆ స్థాయి నటన కనబరచలేదు ఇంకా చెప్పాలి అంటే ఆ రేంజ్ నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోలేదు. పైగా సన్నివేశ పరిమితికి మించిన నటన కనబరుస్తూ డైలాగుని ముక్కలు ముక్కలుగా విరిచేసి చెప్పడం అలవాటు చేసుకున్నారు దీని వల్ల పాత్ర మీద చాలా ప్రభావం పడుతుంది. ఈ చిత్రంలో కూడా అదే చేసాడు. సురభి చూడటానికి బాగుంటుంది, ఈ అమ్మాయి నటన కూడా బాగుంటుంది కానీ సమస్య ఏమిటంటే ఆమెకి నటించే స్థాయి పాత్ర ఇవ్వలేదు పైగా అవసరానికి మించిన మేకప్ వేసి ఆమెకి ఉన్న సహజ అందాన్ని కూడా చెడకోట్టేసారు. నరేష్ చేసిన పాత్ర చాలా బాగుంది అక్కడక్కడా నవ్వించగలిగారు. ముఖేష్ రుషి పాత్ర పవర్ఫుల్ గా బాగుంది, కానీ చిత్రానికి అవసరమా అనిపిస్తుంది. శకలక శంకర్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది, సప్తగిరి నవ్వించడానికి ప్రయత్నించాడు కాని కొన్ని చోట్ల మాత్రమే సఫలం అయ్యారని చెప్పుకోవాలి.. అజయ్ పాత్ర బాగుంది విలనిజం బాగా పండించాడు. అనీష సింగ్ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు, ఈ పాత్ర ఎందుకు అంటే కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయ్యింది.. కథ అనేది పాత చింతకాయ పచ్చడి కన్నా పాతది, నాలుగు తెలుగు చిత్రాలను చూసి ఈ చిత్రాన్ని చూసినా లేదా రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూసే వారు ప్రతి సన్నివేశాన్ని మూడు నిమిషాల ముందే ఊహించేయగలం, అంత లోపాయుక్తంగా ఉంటుంది కథనం, పోనీ అదయినా సజావుగా సాగుతుందా అంటే లేదు సాఆఆఆగుతుంది. చిత్ర నిడివి రెండు గంటలే అయినా ఒక రోజంతా బీరువాలో గడిపేసినట్టు ఉంటుంది. కొన్ని డైలాగ్స్ బాగున్నా కూడా సందీప్ కిషన్ చెప్పిన విధానంలో చాలా దారుణంగా తయారయ్యాయి. ఈ విభాగం కాకపోయినా వెలిగొండ శ్రీనివాస్ కోసం మరొక సారి చెప్తున్నాం సందీప్ కిషన్ తన డైలాగ్ డిక్షన్ మీద చాలా వర్క్ అవుట్ చెయ్యాలి. కాగా దర్శకత్వం, సన్నివేశం ఎంత బాగున్నా కూడా కన్మణి టేకింగ్ వలన పాడయిపోయిన సన్నివేశాలు అతని చిత్రాలలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా అయన ఎంచుకునేవి అన్ని ఇంత పురాతన కథలుగా ఎందుకు ఉంటాయో మాత్రం మాకు ఎప్పటికి అర్ధం కాని విషయం. సినిమాటోగ్రఫీ అందించిన చోట కే నాయుడు అయన స్థాయి ప్రతిభ కనబరిచారు. సంగీతం అందించిన తమన్ పాటలు పరవలేధనిపించాయి, నేపధ్య సంగీతం కూడా బాగానే ఉంది. గౌతంరాజు మీద కూడా చిత్ర ప్రభావం చాలానే ఉన్నట్టు తెలుస్తుంది, చిత్రం చూస్తూ ఎడిటింగ్ రూమ్ లో నిద్రపోయారేమో కొన్ని సన్నివేశాలు సాగుతున్నా కూడా గమనించలేదు. ఒకవేళ గమనించినా క్షమించేసారు. ఆనంది ఆర్ట్స్ మరియు ఉషా కిరణ్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలు నిర్మాణ సంస్థకి తగ్గట్టుగానే బాగున్నాయి..నటుడిగా మంచి భవిష్యత్తు ఉన్న సందీప్ కిషన్ ఒక చట్రంలో ఇరుక్కుపోయారు. ఒక గిరి గీసుకొని అందులోనే ఉండిపోతున్నారు. సందీప్ కిషన్ ఎన్ని చిత్రాలు వచ్చాయో సంఖ్య గుర్తు లేదు కాని అయన చేసిన పాత్రలు మాత్రం ఒక్కటే టైపు.. లేదంటే రెండు.. ప్రస్థానం లో ఒక పాత్ర, మిగిలిన అన్ని చిత్రాలలో ఒకే పాత్ర.. ఇప్పటికయినా సందీప్ కిషన్ ఈ విషయం గుర్తించి తరువాతి చిత్రంలో అయన నటనలో అయిన విభిన్నత చూపించాలి లేదా అయన ఎంచుకునే కథలో అయినా చూపించాలి. తెలుగు పరిశ్రమకి కొన్ని యుగాలకు సరిపడా మాస్ హీరోలు ఉన్నారు.. సందీప్ కిషన్ లాంటి ప్రతిభ మరియు ఆస్కారం ఉన్న నటుడు కూడా మరొక మాస్ హీరో అవ్వాలని ప్రయత్నిస్తే చట్రపు సంకెళ్ళు మరింత ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికయినా వాటిని తెంచుకొని బయటపడతాడని ఆశిద్దాం.. నిర్మాణ సంస్థలని చూసి ఈ చిత్రాన్ని చూడాలని మాత్రం అనుకోకండి దారుణంగా నిరుత్సాహపడటం ఖాయం.. నేను సందీప్ కిషన్ కి వీరాభిమాని అంటారా... ప్రయత్నించండి కానీ బాగుంటుందని ఆశించకండి..Sundeep Kishan,Surabhi,Kanmani,Ramoji Rao,Thaman S.చివరగా : బీరువా - ఇదో ఖాళీ బీరువా..

మరింత సమాచారం తెలుసుకోండి: