అల్లు అర్జున్ , కొన్ని సన్నివేశాలు , డైలాగ్స్ , పాటలు అల్లు అర్జున్ , కొన్ని సన్నివేశాలు , డైలాగ్స్ , పాటలు కథనం , బలహీనమయిన పాత్రలు , అనవసరమయిన సన్నివేశాలు , నేపధ్య సంగీతం , దర్శకత్వం

విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) , సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) కొడుకు, విలువలని నమ్మి జీవితాన్ని గడిపే వ్యక్తి సత్యమూర్తి అడిగినవాడికి కాదనకుండా సాయం చేస్తుంటాడు, తెలివితేటలు మనిషిని మోసం చెయ్యడానికి కాదు పని చేసుకోడానికి మాత్రమే అన్నది సత్యమూర్తి సిద్ధాంతం. విరాజ్ కి మరియు పల్లవి(అదా శర్మ) కి  నిశ్చితార్థం అవుతుంది. సత్యమూర్తి ప్రమాదం లో మరణిస్తాడు ఆ తరువాత సత్యమూర్తి కుటుంబం కష్టాల పాలవుతుంది.  ఒక్కసారిగా ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి రోడ్ మీదకు వచ్చేస్తారు. నాన్న ఆస్థి కావాలా నాన్న పేరు కావాలా అన్న ప్రశ్నకి నాన్న పేరు నిలబెట్టాలన్న సమాధానం ఇస్తాడు విరాజ్. దాంతో ఆస్తులు అంతస్తులు అన్ని పోయి సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది. పల్లవితో పెళ్లి ఆగిపోతుంది, జీవితం ఎటూ కదలని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో విరాజ్ కి సుబ్బలక్ష్మి/సమీర(సమంత) పరిచయం అవుతుంది. సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్) డబ్బు మనిషి , తండ్రి చనిపోతే సాయంత్రం విమానం కి టికెట్ చీప్ అని  సాయంత్రం బయలుదేరిన వ్యక్తి అతను అలాంటి వ్యక్తి కూతురు సమీర, గతంలో సత్యమూర్తి మూలాన తను నష్టపోయానని, సత్యమూర్తి ఒక మోసగాడు అని లిటికేషన్ లో ఉన్న స్థలాన్ని  అమ్మాడని విరాజ్ తో అంటాడు సాంబ శివ రావు , ఆ స్థలాన్ని ఎలాగయినా తను విడిపించి తీసుకొస్తానని అలా చేస్తే తన తండ్రి గొప్పవాడని ఒప్పుకోవాలని సాంబ శివ రావు తో పందెం కాస్తాడు విరాజ్. ఆ స్థలం దేవ్ రాజ్ నాయుడు(ఉపేంద్ర) కబ్జా చేసుంటాడు. అతన్ని మోసం చేసి ఎలాగయినా ఆస్తి పత్రాలను కాజేయాలని విరాజ్ ఆలోచన ఇదే ప్రయత్నంలో దేవ్ రాజ్ కి విరాజ్ నచ్చి తన ఆస్తిని మరియు తన చెల్లెలు వల్లి(నిత్య మీనన్)ని విరాజ్ కి ఇచ్చేస్తానని అంటాడు. అప్పటికే సమీర తో ప్రేమలో ఉన్న విరాజ్ ఇప్పుడు నిజం చెప్తే ఆస్తి దొరకవు, అబద్దం చెప్పి వల్లిని పెళ్లి చేసుకోలేడు. ఆ తరువాత ఏం అనేది మిగిలిన కథ...  

అల్లు అర్జున్ పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం మొత్తం అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతుంది , సత్యమూర్తి అనే పాత్రలో అతని నటన చాలా బాగుంది.  అతని ఎనెర్జీ, అతని డాన్స్ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో అతని డైలాగ్ డిక్షన్ అద్భుతంగా ఉంది. ఉపేంద్ర ఉన్న కాసేపట్లోనే తన బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో తన పాత్రకి కావలసినంత బలం చేకూర్చారు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర చాలా బాగుంది అయన నటన కూడా ఆకట్టుకుంది. సమంత పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు పాటలకు మాత్రమే అన్న ట్యాగ్ లైన్ బాగా సూట్ అవుతుంది. అదా శర్మ ఉన్న కాసేపు తన అందాలతో మరియు అభినయంతో ఆకట్టుకుంది. నిత్య మీనన్ కీలక పాత్రలా అనిపించినా కీలకం అని ఎక్కడా అనిపించలేదు. ఆమె నటనలో లోపం లేదు , పాత్రను మలచిన తీరు బాగాలేదు. స్నేహ ఉన్న కాసేపు తన ఉనికి కనపడేలా చేసింది ముఖ్యంగా తమిళ యాసతో తెలుగులో మాట్లాడి చాలా ఆకట్టుకుంది. కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, అలీ, వెన్నెల కిషోర్ , పవిత్ర లోకేష్ , సింధు తోలాని, సంపత్.. చెప్పుకుంటూ పోతే అలసటతో ఆయాసం వచ్చేంత పొడవయిన నటీనటుల లిస్టు ఉన్నా ఉపయోగించుకోవడం లో దర్శకుడు దారుణంగా  విఫలం అయ్యాడు. 

రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ముందుగా రచన గురించి మాట్లాడితే, పెన్ను పేపరు చేత బట్టి ,తోచినదల్లా రాయాబట్టి ఈ చిత్రం ఇలా తగలడిందే త్రివిక్రమ అన్నట్టు...  మాటల బ్రహ్మే రాతల్లో తడబడితే మరి ప్రేక్షకుల పరిస్థితి ఏంటి. త్రివిక్రమ్ చేసిన చిత్రాలలో ఇప్పటి వరకు పాత్రలో బలం లేకపోవడం అంటూ జరగలేదు కాని మొదటి సారి గమ్యం లేని కథ , బలం లేని పాత్ర, అవసరం లేని సన్నివేశాలు , గుర్తింపు లేని మాటలు ఈ చిత్రంలో గమనించవచ్చు.  ఆస్తులంటే డబ్బులు కాదు విలువలు అని చెప్పి ఒక తండ్రి పెంచిన కొడుకు కథ ఇది.. ఈ విషయం మొదటి ఐదు నిమిషాల్లోనే అర్ధం అయిపోతుంది ప్రేక్షకుడికి, ఆ తరువాత ఈ విషయాన్నీ కనెక్ట్ చేస్తూ కథ సాగదు, పాత్ర సాగదు. పాత్రతో లేదా పరిస్థితితో కనెక్ట్ కాని ప్రేక్షకుడిని మూడు గంటల పాటు కూర్చోబెట్టడమే కష్టం, ఈ చిత్రంలో కూడా ప్రేక్షకుడు కూర్చోలేకపోయాడు.  దర్శకుడిగా కూడా త్రివిక్రమ్ దారుణంగా  విఫలం అయ్యారు. అయన చిత్రాలలో అతి బలహీనమయిన చిత్రంగా ఈ చిత్రాన్ని పేర్కొనచ్చు. మిగిలిన సాంకేతిక అంశాలకు వస్తే ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది కాని కొన్ని చోట్ల బ్లో అవుట్ అవ్వడం క్లియర్ గా కనిపించేస్తుంది. ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది, సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ పాటలు బానే ఉన్నాయి కాని నేపధ్య సంగీతంలో చిత్రానికి చాలా ద్రోహం చేసారనే చెప్పుకోవాలి. ఏ  సన్నివేశంలోనూ ఆ సన్నివేశానికి సరిపోయే నేపధ్య సంగీతాన్ని అందించలేకపోయారు. ఎడిటింగ్ చేసిన ప్రవీణ్ పూడి ఇంకాస్త కనికరం లేకుండా కత్తిరించి ఉండవలసింది. రవీందర్ అందించిన ఆర్ట్ వర్క్ బాగుంది. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. 

"మనుషులు డబ్బుల కోసం బతుకుతారు , కాని విలువల కోసం బతకడం ముఖ్యం" ఇది చెప్పాలనుకుని ఈ కథను మొదలెట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాని ఈ పాయింట్ తప్ప అన్ని కనిపిస్తుంది చిత్రంలో , అయన శైలిలోనే చెప్పాలంటే "సినిమా బాగుండటం అంటే బలమయిన సన్నివేశాలు నాలుగు ఉండటం కాదు, బరువయిన కథ ఒకటి ఉండటం" ఈ పాయింట్ కి సరిపోయే నాలుగు సన్నివేశాలు అయితే ఉన్నాయి కానీ ఈ పాయింట్ చ్చుట్టు తిరిగే కథ ఒకటి బరువుగా లేదు . అయన శైలి పాయింట్ "మనిషంటే వస్తువులతో కాదు విలువలతో బతకాలి" ఈ చిత్రంలో ఉంది కాని సమస్య ఏంటంటే పాత్రలు అయన శైలిలో లేదు , మాటలు అయన శైలిలో లేదు, దర్శకత్వం అయన శైలి కాదు, అసలు ఈ చిత్రం త్రివిక్రమ్ తీసినట్టు లేదు. అందరిలా ఉండరు కనుకనే అయన  త్రివిక్రమ్ శ్రీనివాస్ అయ్యారు , ఆయన కూడా అందరిలానే సినిమాలు తియ్యాలని ప్రయత్నిస్తే అందరికీ ఆయనకి తేడా లేకుండా పోతుంది.  సరిగ్గా చెప్పాలంటే అమెరికా వాడు అప్పడం చెయ్యలేడు , పాకిస్తాన్ వాడు పాయాసం చెయ్యలేడు అలానే త్రివిక్రమ్ ఇలాంటి చిత్రం చెయ్యలేడు. ఈ చిత్రాన్ని అయన మరోసారి గమనించి పరీక్షించి పరిశీలించి ఆయన్ను ఆయనే ప్రశ్నించి మనసుని శొదించి మెదడుని మదించి ఒక మంచి చిత్రంతో మళ్ళీ మన ముందుకి వస్తాడని కోరుకుందాం . ఒక త్రివిక్రమ్ అభిమానిగా నన్ను చాలా నిరుత్సాహపరచిన చిత్రం s /o సత్యమూర్తి, మీరు కూడా అయన అభిమాని అయితే నిరుత్సాహానికి సిద్దపడి థియేటర్ కి వెళ్ళండి.. 

Allu Arjun,Samantha Ruth Prabhu,Adah Sharma,Nithya Menen,Trivikram Srinivas,S. Radha Krishna,Devi Sri Prasad.s /o సత్యమూర్తి - విలువలు ఉన్నాయి విషయం లేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: