రేపు ప్రపంచ వ్యాప్తంగా జరగబోతున్న ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్ ప్రేమ పై తన అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ అమ్మాయిని ప్రేమించడం అంటే ఆమె అలవాట్లను, ఆమె అభిరుచులను గౌరవించడం అంటూ ప్రేమ పై కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రణతి గురించి మాట్లాడుతూ తన భార్య ప్రణతి ఒకప్పుడు తనకు ఇష్టం లేకపోయినా వేరే అబ్బాయిని చూడ్డానికి వెళ్లినపుడు ఆ పెళ్ళి చూపులు లాంటి మీటింగ్‌ను చెడగొట్టి ఆమెను సేవ్‌ చేసిన విషయాన్ని బయట పెట్టాడు మనోజ్. 

ఇక మనోజ్ చెప్పిన వివరాలలోకి వెళితే ‘ప్రణతి మా వదిన వాళ్ల క్లాస్‌ మేట్‌. ఆమెను కలవడానికి ఓసారి మా ఇంటికొచ్చింది. మొదటిసారి తనను చూసినపుడే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటమ్మాయినే చేసుకోవాలని అనుకున్నా. రెండో రోజు జరిగిన ఓ సంఘటన మా ఇద్దరినీ దగ్గర చేసింది. ఆ రోజు నేను ఓ ఫ్రెండుతో కలిసి రెస్టారెంటుకి వెళ్లాను. కాసేపయ్యాక వదిన, ప్రణతి, ఓ అబ్బాయి అక్కడికొచ్చారు. విషయం ఏంటని అడిగితే, తనకిష్టం లేకపోయినా ఇంట్లోవాళ్లు బలవంతంగా ఈ అబ్బాయిని కలిసే ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇది అనఫీషియల్‌ పెళ్లి చూపులు' అని చెప్పింది. 

అంతే ‘వెంటనే మధ్యలో నేను దూరిపోయా. ఏవేవో చెప్పేసి అర్జెంట్‌ పని అనిచెప్పి ప్రణతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయా. ఆ క్షణంలో ఎందుకలా చేయాలనిపించిందో, ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యం బంధం మొదలై ఆ తరువాత ప్రేమగా మారి ఆపై పెళ్ళిగా మారింది’ అని అన్నాడు మంచు మనోజ్.

ఇదే సందర్భంలో మనోజ్ మాట్లాడుతూ తమ మధ్య ప్రేమ మొదలై చాల రోజులు నడిచినా తామిద్దరం ఎప్పుడూ మనసులో ప్రేమ ఉన్నా ‘ఐ లవ్ యూ’ లు చెప్పుకోలేదు అన్న విషయాన్ని బయట పెట్టాడు మనోజ్. అంతేకాదు ప్రేమ అంటే ప్రేమించే ఎదుటి వ్యక్తిలోని మంచి – చెడు, రెండూ సమానంగా ప్రేమించాలి అని అంటూ అప్పుడే నిజమైన ప్రేమకు అర్ధం ఉంటుంది అంటూ రేపు జరగబోతున్న ప్రేమికుల దినోత్సవానికి సందేశం ఇచ్చాడు మనోజ్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: