నిన్న రిలీజ్ డేట్ ప్రకటించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన  ‘అ..ఆ’ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు. సంక్రాంతికి విడుదల అవుతుంది అని అనుకున్న ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడి చిట్టచివరకు టాప్ హీరోల భారీ సినిమాల మధ్య సమ్మర్ రేస్ లో నిలుస్తోంది. 

ఇప్పటి వరకు టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ మొట్టమొదటిసారి ఒక యంగ్ హీరో నితిన్ ను ఆధారంగా పెట్టుకుని సమంత జంటగా చేసి రూపొందిన ఈసినిమా ఫస్ట్ లుక్ చూడగానే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అనిపిస్తోంది. హీరో నితిన్ ఒక పొడవాటి ట్రావెల్ బ్యాగ్ ను భుజాన వేసుకుని పొలాల్లో నడిచి వెళుతుంటే హీరోయిన్ సమంత జట్కా బండిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.

అయితే ఈ ఫస్ట్ లుక్ ను చూడగానే ఈసినిమా కథ కూడ పల్లెటూరి నేపధ్యంలో జరిగే కథ లాగే కనిపిస్తోంది. నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సూపర్ హిట్ అయిన తరువాత తెలుగులో మళ్ళీ పల్లెటూరి వాతావరణ నేపధ్యంలో వచ్చే సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీనితో ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్ ను కలక్షన్స్ గా మార్చుకోవడానికి త్రివిక్రమ్ కూడ ఇలా నాగార్జున అనుసరించిన వ్యుహాన్నే అనుసరిస్తున్నాడా అని అనిపించడం సహజం. 

నితిన్ కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టని భారీ బడ్జెట్ తో తీసిన ఈసినిమాకు దాదాపు 40 కోట్లు ఖర్చు అయింది అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత భారీ బడ్జెట్ ను రికవర్ చేసే శక్తి నితిన్ కు లేకపోయినా త్రివిక్రమ్ క్రేజ్ పై కొండంత ఆశతో విడుదల అవుతున్న ఈసినిమా ఫలితం బట్టే నితిన్ కెరియర్ ఆధార పడి ఉన్నది అన్న మాట వాస్తవం..  



మరింత సమాచారం తెలుసుకోండి: