జగపతి బాబుకు కొడుకులు లేరన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే. అయితే జగపతి మాటల సందర్భంలో తన కొడుకు కాని కొడుకు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ‘లెజెండ్' సినిమాతో విలన్ అవతారం ఎత్తిన జగపతి బాబు హవా ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా నడుస్తోంది. నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో అత్యధిక పారితోషకం అందుకునే అతి కొద్ది మంది నటుల్లో ఒకడిగా ఎదిగి పోయిన జగపతి బాబు ఆర్థికంగా కూడా మంచి స్థితికి చేరడంతో తన తండ్రి కోరికలను నెరవేర్చే పనిని ప్రారంభించాడు.  

తన తండ్రి స్థాపించిన ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్' ను తిరిగి ప్రారంభించి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యం లో  ‘క్లిక్ సినీ కార్ట్’ పేరుతో సినిమాల్లోకి రావాలనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించే వెబ్ పోర్టల్  మొదలు పెట్టి నూతన నటీనటులతో సినిమాలు తెయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 

ఈ సందర్భంగా జరిగిన ఫంక్షన్ లో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆశ్చర్య పరిచాయి. ‘మా నాన్నకు కొన్ని కోరికలుండేవి. నాతో పాటు మా అన్నయ్యకు కూడా అమ్మాయిలే పుట్టడంతో వారసుడు లేడన్న లోటును ఫీలయ్యేవారు మానాన్న. ఇప్పుడు నేను మా జగపతి పిక్చర్స్ సంస్థను తిరిగి ప్రారంభిస్తున్నా. ఈ సంస్థే మా కుటుంబానికి వారసుడిగా భావిస్తున్నా’ అంటూ తన జగపతి ఆర్ట్స్ ను తన సొంత కొడుకుగా మార్చుకున్నాడు జగపతి బాబు. 

అయితే ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగం చాల సమస్యల మధ్య తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపధ్యంలో తమ కుటుంబానికి పెద్దగా కలిసిరాని చిత్రనిర్మాణాన్ని తిరిగి జగపతి బాబు ప్రారంభించి ఎందుకు సాహసం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసిన జగపతి బాబు ఇలా కొత్త ప్రయోగాలు చేయడం ఎందుకు అని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: